‘పల్స్’ సక్సెస్ | Pulse Polio program successful | Sakshi
Sakshi News home page

‘పల్స్’ సక్సెస్

Jan 20 2014 2:36 AM | Updated on Sep 2 2017 2:47 AM

తొలి విడత పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతం అయింది. 70లక్షల మంది పిల్లలకు ఆదివారం చుక్కల మందు వేశారు.

 సాక్షి, చెన్నై: తొలి విడత పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతం అయింది. 70లక్షల మంది పిల్లలకు ఆదివారం చుక్కల మందు వేశారు. మంత్రులు తమ జిల్లాల్లో పిల్లలకు చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలియో మహమ్మారిని దేశం నుంచి తరిమి కొట్టడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ వస్తున్నాయి.  ప్రతి ఏటా పోలియో చుక్కల్ని వేస్తున్నారు. తొలి విడతగా జనవరిలోను, మలి విడతగా ఫిబ్రవరిలోను చుక్కల మందు వేస్తున్నారు. ఆ దిశగా తొలి విడత కార్యక్రమాన్ని రాష్ర్టంలో విజయవంతం చేయడం లక్ష్యంగా ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంది. ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలతో పాటుగా బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, వినోద కేంద్రాలు, జన సంచారం అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో శిబిరాల్ని ఏర్పాటు చేసింది.
 
 రాష్ర్ట వ్యాప్తంగా 43,501 శిబిరాల్ని ఏర్పాటు చేశారు. 70.39 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి శిబిరంలోను నలుగురు సిబ్బందిని నియమించారు. సంచార వాసులు, కార్మికుల పిల్లలు, ప్రయాణాల్లో ఉండే వారి కోసం ప్రత్యేకంగా మొైబె ల్ శిబిరాలని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,652 మొబైల్ శిబిరాలను, మరో వెయ్యి బృందాలను ఏర్పాటు చేశారు. వీరంతా ఆయా ప్రాంతాల్లో, ఇంటింటా వెళ్లి చుక్కలు వేశారు. పల్స్ పోలియో విజయవంతానికి రెండు లక్షల మంది సిబ్బంది విధుల్లో నిమగ్నం అయ్యారు. విజయవంతం: తొలి విడత పల్స్ పోలియోను ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు ప్రారంభించారు.
 
 తాంబరంలో మంత్రి టీకేఎం చిన్నయ్య, తిరువణ్ణామలైలో ఎం సుబ్రమణ్యం, ధర్మపురిలో మంత్రి పళనియప్పన్, ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ పిల్లలకు చుక్కలు వేసి పల్స్ పోలియోను ప్రారంభించారు. చెన్నై కొళత్తూరులో ఏర్పాటు చేసిన శిబిరంలో మేయర్ సైదై దురైస్వామి  పిల్లలకు చుక్కలు వేశారు. చెన్నైలో 1325 శిబిరాలు ఏర్పాటు చేయగా, ఐదు లక్షలకు పైగా పిల్లలకు చుక్కలు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది పిల్లలకు  చుక్కలు వేసినట్టుగా ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, పాఠశాలలు, మెరీనా బీచ్, కోయంబేడు బస్టాండ్ తదితర ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో తమ పిల్లలకు తల్లిదండ్రులు చుక్కలు వేయించారు. మలి విడతగా ఫిబ్రవరి 23న పోలియో చుక్కలు వేయనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement