మిస్టరీ ముడి విప్పండి! | Petition on the death of mother Jayalalitha's death | Sakshi
Sakshi News home page

మిస్టరీ ముడి విప్పండి!

Jun 24 2017 3:53 AM | Updated on Sep 5 2017 2:18 PM

మిస్టరీ ముడి విప్పండి!

మిస్టరీ ముడి విప్పండి!

దేశవ్యాప్త కలకలానికి కారణమైన అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం మళ్లీ తెరపైకి వచ్చింది.

మళ్లీ తెరపైకి ‘అమ్మ’ మరణం
మిస్టరీ ఛేదించాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌
శశికళ, పన్నీర్‌ సహా 186 మందిపై ఫిర్యాదు

సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశవ్యాప్త కలకలానికి కారణమైన అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం మళ్లీ తెరపైకి వచ్చింది. అమ్మ మరణం మిస్టరీగా మారడానికి కారకులైన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ప్రధాన కార్యదర్శి శశికళ సహా 186 మందిపై కేసులు పెట్టాలని కోరుతూ కోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలు కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. జ్వరం, డీహైడ్రేషన్‌ అస్వస్థతతో అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత ఇక ప్రాణంతో తిరిగిరాలేదు.

గత ఏడాది సెప్టంబర్‌ 22 నుంచి డిసెంబర్‌ 5వ తేదీన ఆమె మరణించిందని ప్రకటించే వరకు అంతా గోప్యంగా ఉంచారు. ప్రజలు, పార్టీ నేతలు కోరినా చికిత్స పొందుతున్న జయ ఫొటోను విడుదల చేయలేదు. అమ్మ కోలుకుంటున్నారు, నేడో రేపో డిశ్చార్జ్‌ అని మంత్రులు, అన్నాడీఎంకే నేతలు చివరి వరకు  ప్రకటిస్తూనే ఉన్నారు. జయ మరణం తరువాత అదే పార్టీకి చెందిన న్యాయవాది పుహళేంది అన్నాడీఎంకే కార్యకర్తల యువజన విభాగాన్ని స్థాపించాడు.

ఈ విభాగంలోని కడలూరుకు చెందిన అన్నాడీఎంకే న్యాయవాది సెల్వవినాయగం అమ్మ మరణం వెనుక శశికళ, పన్నీర్‌సెల్వం హస్తం ఉందంటూ గత నెల తేనాంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కేసుపై పోలీసులు ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో న్యాయవాది పుహళేంది చెన్నై సైదాపేట 18వ మెట్రోపాలిటన్‌ కోర్టులో పిటిషన్‌ వేశాడు. జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఆమె బాగా కోలుకుంటున్నట్లుగా అపోలో యాజమాన్యం విడుదల చేసిన బులిటెన్లలో పేర్కొందని, అయితే ఈ ప్రకటనలకు భిన్నంగా 2016, డిసెంబర్‌ 5వ తేదీన రాత్రి 11.30 గంటలకు ఆమె ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రకటించారని పిటిషన్‌లో పేర్కొన్నాడు.

రాజకీయ ప్రయోజనాల కోసం ఆమె ప్రాణాలు తీశారని, ఈ నేరంలో శశికళ, పన్నీర్‌సెల్వం, అన్నాడీఎంకే నిర్వాహకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అపోలో ఆస్పత్రి యాజమాన్యం మొత్తం 186 మంది పాత్ర ఉందని పిటిషన్‌లో చేర్చాడు. ఈ 186 మందిపై కేసులు నమోదు చేయాల్సిందిగా తేనాంపేట పోలీస్‌స్టేషన్‌లో గత నెల 20వ తేదీన ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోనందున తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోర్టును కోరాడు. జయ మరణంపై కేసులు పెట్టేవరకు తమ పోరాటం ఆగదని న్యాయవాది పుహళేంది మీడియాకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement