మోదీ పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారు: పవన్

మోదీ పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారు: పవన్ - Sakshi


ప్రత్యేక హోదా ఇస్తామంటూ మూడు నాలుగేళ్లు చెప్పి.. చివరకు రెండు లడ్డూలు చేతిలో పెట్టారని, మీరిచ్చిన పాచిపోయిన లడ్డూలు మాకొద్దని జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన టీడీపీ, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ పాచిపోయిన లడ్డూలు ఇస్తున్నారని, దానికంటే మా బందరు లడ్డూలు బాగుంటాయని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు వెన్నుపోటు పొడిచారని బీజేపీ దగ్గరకు వెళ్తే.. బీజేపీ వాళ్లు పొట్టలో పొడిచారని అన్నారు. అటు తెలంగాణకూ న్యాయం చేయలేదని, వాళ్లకు హైకోర్టును ప్రత్యేకంగా ఇవ్వమంటే ఇవ్వడంలేదని.. ఇటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని.. వాటిని అడుగుతుంటే మాత్రం రెండు పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారని విమర్శించారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారని, దీనికి స్వార్థ రాజకీయాలే కారణమని అన్నారు. పౌరుషం చచ్చిందనుకుంటున్నారా.. పోరాటపటిమ తగ్గిందనుకున్నారా అంటూ గర్జించారు. 2014లో రాష్ట్రాన్ని విడగొట్టినప్పటి నుంచి ప్రతి బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ, ప్రతి టీడీపీ నేత ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పారని, తాను కూడా వాళ్ల మాటలు నమ్మానని చెప్పారు.టీడీపీ నేతలపై ఇప్పటికీ తనకు గౌరవం తగ్గలేదని, కానీ ప్రజా సమస్యల విషయంలో మాత్రం తన వైఖరి ఇంతేనని స్పష్టం చేశారు. పాచిపోయిన ఆ లడ్డూలు టీడీపీ తీసుకుంటుందా లేదా అనేది తనకు అనవసరం అన్నారు. మీరు సమస్యలను పట్టించుకోకపోయినా పర్వాలేదు గానీ, కొత్త సమస్య సృష్టించవద్దని చెప్పారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టే దరిద్రపు ఆలోచనలు దయచేసి ఆపాలన్నారు. కళ్లు మూసుకుంటే నిద్ర కాదు.. జ్ఞానం అనుకోరా అని ప్రశ్నించారు. తాను రెండున్నరేళ్లుగా నిద్రలో లేనని తెలిపారు. రాజకీయాలంటే గడ్డం గీసుకున్నంత తేలిక కాదన్నారని.. కానీ గడ్డం గీసుకున్నంత తేలికగా రెండు రాష్ట్రాలు ఇచ్చారుగా అని పవన్ ప్రశ్నించారు. తాను సినిమా హీరోను కావొచ్చు గానీ మీలాగా వేల కోట్లు వేల ఎకరాలు సంపాందించుకోలేదని చెప్పారు.  తన తాత ఒక పోస్ట్ మ్యాన్ అని, తన తండ్రి పోలీస్ కానిస్టేబుల్ అని, తమకు రాజకీయాలు తెలియదని, తాము చాలా సామాన్యులమని, అందుకే అందరిలాగే బతకడం ఇష్టమని అన్నారు. సినిమాలు వదిలేయమంటే ఇప్పుడే వదిలేస్తానని, అలా వదిలేస్తే మీరే తనకు భోజనం పెట్టాలని చెప్పారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top