
నేనే సీఎం...
రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పట్లో నాయకత్వ మార్పులేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
నాయకత్వ మార్పు లేదు..
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
బెంగళూరు : రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పట్లో నాయకత్వ మార్పులేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వంలో కానీ, పార్టీ వేదికలపై కానీ నాయకత్వ మార్పునకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ప్రజల మనసుల్లో సైతం నాయకత్వాన్ని మార్చాలనే ఆలోచన లేదని అన్నారు. నగరంలోని లాల్‌బాగ్ రోడ్‌లో ఉన్న ఎంటీఆర్ హోటల్‌కు శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా వచ్చిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్కడే అల్పాహారాన్ని తీసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...‘రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సమయంలో నాయకత్వ మార్పు గురించి వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహలు మాత్రమే. ఇలాంటి వదంతులన్నింటిపై నేను స్పందించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మా లక్ష్యమంతా బీబీఎంపీ ఎన్నికల్లో గెలుపు సాధించడం పై మాత్రమే ఉంది’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇక ఇదే సందర్భంలో గురువారం రోజున కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎస్.ఎం.కృష్ణ, బి.కె.హరిప్రసాద్‌లు చేసిన వ్యాఖ్యలపై సైతం సిద్ధరామయ్య స్పందించారు. ‘అయినా వారిద్దరూ చేసిన వ్యాఖ్యలు నా గురించే అని ఎందుకు అనుకోవాలి? ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురించి కూడా అయి ఉండవచ్చుగా! వేరే ఎవరి గురించి అయినా కావచ్చు కదా?’ అని మీడియా వారిని ప్రశ్నించారు.
ఆహా బహు రుచికరం బాంబే హల్వా....
ఇక బీబీఎంపీ ఎన్నికల నేపథ్యంలో గత పది రోజులుగా బిజీబిజీగా గడిపిన సీఎం సిద్దరామయ్య శుక్రవారం రోజున కాస్తంత నింపాదిగా కనిపించారు. తన సహచరుడు, మంత్రి హెచ్.సి.మహదేవప్ప, ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌తో కలిసి శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా ఎంటీఆర్ హోటల్‌కు చేరుకున్నారు. అకస్మాత్తుగా సీఎం తమ హోటల్‌కు రావడంతో అక్కడి యాజమాన్యంతో పాటు సిబ్బంది, వినియోగదారులు సైతం కాసేపు కంగారుపడ్డారు. అనంతరం ఎంటీఆర్ యాజమాన్యం సీఎంకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లను చేసి ఆయనకు ఏ అల్పాహారం కావాలో అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో సిద్ధరామయ్య బాంబే హల్వా, రవ్వ ఇడ్లీ, బిసిబేలాబాత్, మసాలాదోసె ఇలా విభిన్న రకాల ఆహార పదార్థాలను తెప్పించుకొని రుచిచూశారు. అనంతరం హోటల్‌లో ఉన్న వినియోగదారులు సీఎంతో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి కనబరిచారు.