కాకానగర్ కేసును ఢిల్లీ పోలీసులు ఛేదించారు. రాష్ట్ర పౌరసరఫరాల విభాగంలో సలహాదారుగా పనిచేస్తున్న కె. విజయ్‌కుమార్‌ను ఆయన భార్య సీత హత్య చేసి, ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు
న్యూఢిల్లీ: కాకానగర్ కేసును ఢిల్లీ పోలీసులు ఛేదించారు. రాష్ట్ర పౌరసరఫరాల విభాగంలో సలహాదారుగా పనిచేస్తున్న కె. విజయ్‌కుమార్‌ను ఆయన భార్య సీత హత్య చేసి, ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. కేసును హత్య-ఆత్మహత్యగా నమోదు చేసుకున్నట్లు చెప్పారు. మెడపై ఉన్న మూడు కత్తిపోట్ల కారణంగానే విజయ్‌కుమార్ మరణించాడని శవపరీక్షలో తేలిందన్నారు. భర్తను కత్తితో పొడిచి, ఆపై తాను ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనపై మాట్లాడేందుకు ఆ దంపతుల కూతురు వరణ్య అంగీకరించలేదని, తాను ఉద్వేగానికి లోనవుతున్నట్లు చెప్పిందన్నారు.
ైనె రుతి ఢిల్లీ డీసీపీ పి. కరుణాకరణ్ ఈ విషయమై మాట్లాడుతూ... ‘కుమార్ మెడపై మూడు గాయాలున్నాయి. మృతదేహం పక్కనే పడిఉన్న వంటింట్లో ఉపయోగించే కత్తిని స్వాధీనం చేసుకున్నాం. దీనినే కుమార్‌ను హత్య చేయడానికి ఉపయోగించినట్లు రుజువైంది. ఇక కుమార్ భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు శవపరీక్ష నివేదికలో స్పష్టమైంద’న్నారు. కుమార్ నిద్రలో ఉన్నప్పుడు అతనిపై ఈ దాడి జరిగినట్లు శవపరీక్షలో తేలిందని, ఆయన ప్రతిఘటించడానికి అవకాశం లేకుండా ఉన్న సమయం(నిద్రిస్తున్నప్పుడు) చూసి సీత ఈ హత్య చేసి ఉండవచ్చనే అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులను, వరణ్యను ప్రశ్నించినప్పుడు కూడా సీతపై తాము చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరిందన్నారు.
తన తల్లి ప్రవర్తన సరిగా ఉండేదికాదని, తన ఫోన్‌ను ఎవరో టాప్ చేస్తున్నారని ఆమె ఎప్పుడూ అనుమానించేదని వరణ్య చెప్పిందన్నారు. జామర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కుమార్‌పై పలుమార్లు ఒత్తిడి తెచ్చినట్లు కూడా తెలిసిందన్నారు. అంతేకాక దంపతులిద్దరి మధ్య ఆస్తి విషయమై కూడా గొడవ జరుగుతుండేదని, కుమార్‌ను గోళ్లతో రక్కడం, కొరకడం వంటికి కూడా చేసేదని స్థానికుల ద్వారా తెలిసిందన్నారు. వీరిద్దరి గొడవతో వరణ్య చాలా ఆందోళనకు గురైందని, మానసికంగా కుంగిపోయిందన్నారు. స్నేహితులతో కలిసి రాజస్థాన్‌కు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిందన్నారు. హత్య జరిగిన రోజు రాత్రి 12.30 గంటకు సీత తన కూతురు వరణ్యకు ఫోన్ చేసిందని, తర్వాత వరణ్య చేసినా సీత నుంచి ఎటువంటి స్పందన రాలేదన్నారు. ఈ మరణాల వెనుక బయటివారి ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. ఇంటికి నాలుగు తలుపులు ఉన్నాయని, అందులో మూడు తాళాలు వేసి ఉన్నాయని, ఒక డోర్‌ను మాత్రం పోలీసులే బద్దలు కొట్టి లోపలికి వెళ్లారని చెప్పారు.