జైపూర్ ‘మెట్రో’ పనులు పూర్తి | Jaipur 'Metro' work completed | Sakshi
Sakshi News home page

జైపూర్ ‘మెట్రో’ పనులు పూర్తి

Sep 19 2013 1:49 AM | Updated on Oct 16 2018 5:07 PM

జైపూర్ మెట్రో ప్రాజెక్టు పనులను ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) రికార్డు సమయంలో పూర్తిచేసింది. కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే ఈ పనులు పూర్తయ్యాయి.

సాక్షి, న్యూఢిల్లీ: జైపూర్ మెట్రో ప్రాజెక్టు పనులను ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) రికార్డు సమయంలో పూర్తిచేసింది. కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే ఈ పనులు పూర్తయ్యాయి. దీంతో బుధవారం ప్రయోగాత్మకంగా ఈ రైలును నడపడం ప్రారంభించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, డీఎంఆర్‌సీ మేనేజింగ్ డెరైక్టర్ మంగూసింగ్‌లు జెండా ఊపి మెట్రో రైళ్లను ప్రారంభించారు. మాన్‌సరోవర్-శ్యాంనగర్ స్టేషన్ల మధ్య 9.25 కిలోమీటర్ల మాన్‌సరోవర్-చంద్‌పోలే కారిడార్‌లో మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కారిడార్‌కు తాత్కాలికంగా గులాబీ లైన్‌గా నామకరణం చేశారు. 
 
 ఈ కారిడార్‌లో మొత్తం తొమ్మిది స్టేషన్లను మరో రెండు నెలల్లో ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి నాలుగు కిలోమీటర్ల పరిధిలో ప్రయోగాత్మకంగా రైళ్లను నడిపి చూస్తున్నామని డీఎంఆర్‌సీ అధికారులు తెలిపారు. త్వరలోనే కారిడార్‌లో పూర్తి నిడివి ప్రయోగాత్మక పరుగును చేపడతామన్నారు. ‘జైపూర్ మెట్రో ప్రాజెక్టు పనులకు 2011, ఫిబ్రవరి 24న శంకుస్థాపన చేశాం. కేవలం రెండున్నర ఏళ్ల వ్యవధిలోనే పనులు పూర్తి చేయడం ఆనందంగా ఉంది..’ అని డీఎంఆర్‌సీ ఎండీ మంగూసింగ్ పేర్కొన్నారు. డీఎంఆర్‌సీ, జైపూర్ మెట్రోరైలు కార్పొరేషన్ (జేఎంఆర్‌సీ)లు చేసుకున్న సంయుక్త ఒప్పందం ప్రకారం జేఎం ఆర్‌సీ కోసం డీఎంఆర్‌సీ ఈ కారిడార్ నిర్మాణ పనులను పూర్తి చేసింది. 9.25 కిలోమీటర్ల పొడవుతో తూర్పు-పశ్చిమ దిక్కులను కలుపుతూ నిర్మించిన ఈ లైన్‌తో జేఎంఆర్‌సీ తొలి దశ ప్రారంభమైంది. 
 
 జైపూర్ మెట్రో రెండో దశలో భాగంగా దుర్గాపురా-అంబాబాబ్రిల మధ్య మరో 23 కిలోమీటర్ల మార్గాన్ని విస్తరించి ఉత్తర-దక్షిణ దిక్కులను కలపనున్నారు. కొత్తగా నిర్మించిన మెట్రో కారిడార్‌ను బ్రాడ్ గే జ్‌తో నిర్మించినట్టు డీఎంఆర్‌సీ అధికారులు తెలిపారు. నిర్మాణంతోపాటు ఓ ఏడాది కాలం నిర్వహణ డీఎంఆర్‌సీ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. ఎన్‌సీఆర్ బయట చేపట్టిన మొదటి మెట్రో  ప్రాజెక్టు ఇదేనని మంగూసింగ్ తెలిపారు. వీటితో పాటు కోల్‌కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లూధియానా, పుణే, లక్నోలలో చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టులకు డీఎంఆర్‌సీ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తోందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement