‘వైద్య’ వివాదం | doctors issue to admk | Sakshi
Sakshi News home page

‘వైద్య’ వివాదం

Jan 4 2014 2:18 AM | Updated on Aug 14 2018 2:14 PM

వైద్యుల నియామకంలో అన్నాడీఎంకే ప్రభుత్వం నిబంధనలకు తిలోదకాలిచ్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 చెన్నై, సాక్షి ప్రతినిధి: వైద్యుల నియామకంలో అన్నాడీఎంకే ప్రభుత్వం నిబంధనలకు తిలోదకాలిచ్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డీఎంకే అధినేత కరుణానిధి, పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ శుక్రవారం విడుదల చేసిన వేర్వేరు ప్రకటనలో ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేశారు. కరుణానిధి హయాంలో అత్యంత ఆధునిక వసతులతో రూ.12 వేల కోట్లతో కొత్త సచివాలయాన్ని నిర్మించిన విషయం తెలి సిందే. జయలలిత ముఖ్యమంత్రి కాగానే దానికి తాళం వేసి పాత సచివాలయాన్నే వినియోగిస్తున్నారు. కొత్త సచివాలయాన్ని స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త భవనంలో గత ఏడాదే వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తగినట్లుగా వైద్యులు, ఇతర సిబ్బంది నియామకం కోసం ప్రభుత్వం గత నెల 27వ తేదీన నోటిఫికేషన్ జారీచేసింది. వైద్యుల నియామకంలో ప్రభుత్వం నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిందని, రిజర్వేషన్ అమలు చేయలేదని, అధికారులకు ఎక్కువ వేతనం నిర్ణయించారని తదితర ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
 
 ఈ క్రమంలో డీఎంకే అధినేత కరుణానిధి ఒక ప్రకటనలో ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైద్యులు, ఇతర సిబ్బంది నియామకంలోను, జీతభత్యాలపైనా నియమ నిబంధనలు పాటించలేదని మండిపడ్డారు. అంతేగాక రిజర్వేషన్ల అమలును సైతం ప్రభుత్వం తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. ఆస్పత్రి డెరైక్టర్‌కు నెలకు రూ.2.50 లక్షలు జీతంగా నిర్ణయించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి, మంత్రులకు సైతం ఇంత పెద్ద మొత్తంలో జీతాలు లేవని ఆయన ఆక్షేపిం చారు. 14 మంది ఆస్పత్రి ప్రధాన వైద్య సలహాదారులకు రూ.1.50 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, తనకు ఆప్తులైన వారికి అధిక లాభం చేకూరుస్తూ ముఖ్యమంత్రి జయలలిత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
 
 ఇలాంటి విపరీత నిర్ణయాలపై పోరాటాలు జరిపేందుకు డీఎంకే ఏమాత్రం వెనుకడుగు వేయదని కరుణ హెచ్చరించారు. అదేవిధంగా పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ సైతం వైద్యుల నియామకం అక్రమాలమయమని వ్యాఖ్యానించారు. వన్నియర్ల సమావేశానంతరం జరిగిన అల్లర్ల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించారు. ఈ కేసుల్లో బాధితులుగామారి జైలు జీవితం గడిపిన వారిని శుక్రవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో రాందాస్ సత్కరించారు. ఈ సందర్భంగా వైద్యుల నియమకాన్ని ప్రస్తావించారు. నియామకాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పార్టీ ఆందోళనలు చేపడుతుందని ఆయన ప్రకటించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement