‘నేను భోజనం చేస్తున్నాను.. ప్రస్తుతం పాయసం తింటున్నాను’ | Why MGR Broke Away from Karunanidhi | Sakshi
Sakshi News home page

‘నేను భోజనం చేస్తున్నాను.. ప్రస్తుతం పాయసం తింటున్నాను’

Mar 18 2026 12:40 PM | Updated on Mar 18 2026 2:36 PM

Why MGR Broke Away from Karunanidhi
  • దేశంలో ఎన్నికల సందడి మొదలైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది.
  • దేశం దృష్టంతా తమిళనాడు ఎన్నికలపైనే నిలిచింది.
  • ఒకప్పుడు తమిళగళాన్ని దేశానికి వినిపించేందుకు ఒక్క డీఎంకే పార్టీ ఉండేది.
  • అలనాటి మేటి నటుడు ఎంజీఆర్ తోడవ్వడంతో కరుణానిధి దూసుకుపోయారు.
  • అయితే.. ఒక్క మంత్రి పదవి విషయంలో ఎంజీఆర్‌ను పక్కన పెట్టిన కరుణానిధి, ఆరోగ్యశాఖ మంత్రి పదవిని ఆశించిన ఎంజీఆర్‌కు ఛైర్మన్‌ పదవితో సరిపెట్టుకోమన్నాడు.
  • ఆ అసంతృప్తితోనే అన్నాడీఎంకే పుట్టుకొచ్చింది.
  • సినిమా, రాజకీయంగా ఎంజీఆర్‌ కంటిలో నలుసులా మారిన కరుణానిధి.
  • డీఎంకేకు ధీటుగా అన్నాడీఎంకే ప్రస్థానం మొదలైంది.
  • కరుణానిధిపై ఎంజీఆర్‌ తిరుగుబావుటా ఎగరేశాడు.
  • ఆ తిరుగుబాటుతో రాజకీయంగా కరుణానిధి గట్టి దెబ్బతిన్నాడు.

సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాలంటేనే.. ఐతే డీఎంకే.. లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లుగా పరిస్థితులుంటాయి. ఈ రెండు పార్టీలు మినహా.. మరో పార్టీ పాగా వేసే అవకాశాలే ఉండవంటే.. అక్కడి పరిస్థితులను, ఓటర్ల విస్పష్ట తీర్పును అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఒక్కటిగా ఉన్న డీఎంకే.. అలనాటి మేటి నటుడు ఎంజీఆర్‌ను కరుణానిధి అణచివేయడంతో అన్నాడీఎంకేగా చీలిపోయింది. ఒక్క మంత్రి పదవి విషయంలో కరుణానిధి మంకుపట్టు.. తమిళనాట మరో ద్రావిడ పార్టీ పుట్టుకకు కారణమైంది. 

ఒక్క మంత్రి పదవి విషయంలో ఎంజీఆర్‌ను 
దేశంలో ఎన్నికల సందడి మొదలైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తమిళనాడు ఎన్నికలపై ఇప్పుడు దేశమంతా దృష్టిసారించింది. ఒకప్పుడు తమిళగళాన్ని దేశానికి వినిపించేందుకు ఒక్క డీఎంకే పార్టీ ఉండేది. ద్రావిడ వాదంతో ఆ పార్టీ ముందుకు సాగేది. అలనాటి మేటి నటుడు ఎంజీఆర్ తోడవ్వడంతో... కరుణానిధి దూసుకుపోయారు. అయితే.. ఒక్క మంత్రి పదవి విషయంలో ఎంజీఆర్‌ను పక్కన పెట్టడమే కాకుండా.. కరుణానిధి ఆయనను రాజకీయంగా సినిమాలపరంగా అణచివేయడం.. పార్టీ నుంచి బహిష్కరించినా.. పరోక్ష టార్చర్‌ను నిలిపివేయకపోవడం వంటి పరిణామాలు డీఎంకే చీలికకు దారితీశాయి. అప్పటి నుంచి తమిళ రాజకీయాల్లో అయితే డీఎంకే.. లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లుగా పరిస్థితులు మారడమే కాకుండా.. ఎవరు అధికారంలోకి వచ్చినా.. ప్రత్యర్థులపై కక్షసాధింపు రాజకీయాలు తీవ్రమయ్యాయి.

ఎంజీఆర్‌ క్రేజ్‌.. అక్కసు వెళ్లగక్కిన కరుణానిధి
అది 1971.. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో డీఎంకే ఘనవిజయం సాధించింది. కరుణానిధికి ఇది రెండోసారి వరుస విజయం. రాజాజీ నేతృత్వంలోని కూటమి ఆ ఎన్నికల్లో ఓటమిపాలైంది. కేంద్రంలోని అప్పటి ఇందిరాగాంధీ సర్కారుకు డీఎంకే దన్నుగా నిలిచింది. నిజానికి అప్పటి డీఎంకే సారధి కరుణానిధే అయినప్పటికీ.. ఆ పార్టీ అభివృద్ధికి ఎంజీఆర్ ఎనలేని సేవ చేశారు. ఆయనకున్న ఫేమ్.. ఫ్యాన్స్ ఫాలోయింగ్ పార్టీని విజయాల బాట పట్టించింది. ఆ తర్వాత.. పార్టీలో ఎంజీఆర్‌కు క్రమంగా పెరుగుతున్న ఆదరణను గుర్తించిన కరుణానిధి.. అణచివేత ధోరణిని ప్రారంభించారు. ఎంజీఆర్ తనకు ఆరోగ్యశాఖ కావాలని కోరుతూ.. మంత్రిపదవిని ఆశించారు. ఆ క్రమంలోనే ఇందిరాగాంధీ శ్రీలంకను సందర్శించడం డీఎంకేకు ససేమిరా నచ్చలేదు. ఆయన శ్రీలంకలో తమిళుల కోసం వేర్పాటువాదాన్ని ప్రోత్సహించారు. ఈ పరిణామాలన్నీ.. డీఎంకేలో చీలిక వస్తుందనే సందేశాలకు దారితీశాయి.

సినిమా వర్సెస్‌ రాజకీయం.. ఏదో ఒకటే 
కరుణానిధి మంత్రిపదవుల విషయంలో తన మంకుపట్టును వదల్లేదు. ఎంజీఆర్‌ను ఈ విషయంలో పక్కనబెట్టారు. ఆ సమయంలో జమ్మూకశ్మీర్‌లో ఓ చిత్ర షూటింగ్‌లో ఉన్న ఎంజీఆర్.. స్వయంగా కరుణానిధికి ఫోన్ చేశారు. తనకు ఆరోగ్యశాఖ మంత్రిగా అవకాశమివ్వాలని కోరారు. అయితే.. నటనకు దూరమైతేనే మంత్రిగా ప్రజాసేవకు అవకాశమిస్తానని కరుణానిధి తేల్చిచెప్పారు. ఎందుకంటే.. అప్పటికే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ యాక్షన్ నిబంధనలను తూచ తప్పకుండా పాటించే పార్టీగా డీఎంకేకు పేరుంది. జోడుపదవులు తగదనేది కరుణానిధి ఆలోచన. 

‘నేను భోజనం చేస్తున్నాను. ప్రస్తుతం పాయసం తింటున్నాను’
అయినప్పటికీ ఆయన ఎంజీఆర్‌కు క్యాబినెట్ హోదాను కల్పిస్తూ.. రాష్ట్ర చిన్నమొత్తాల పొదుపు పథకానికి చైర్మన్‌గా అవకాశం కల్పించారు. అప్పటి నుంచి కరుణానిధితో ఎంజీఆర్‌ అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. 1971 అక్టోబరులో ఎంజీఆర్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ వెంటనే కరుణానిధి అమెరికా వెళ్లారు. అదే సమయంలో.. అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి డిసెంబరు 3న దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. దాంతో అమెరికా పర్యటనలో ఉన్న కరుణానిధి డిసెంబరు 5న ఆగమేఘాల మీద చెన్నైకి తిరిగి వచ్చారు. ఈ పరిణామాలకు సంబంధించి అప్పట్లో ’ద హిందూ‘ విలేకరి సత్య స్టూడియోలో షూటింగ్‌లో ఉన్న ఎంజీఆర్ స్పందన కోసం ఫోన్ చేశారు.  ఆ ఫోన్‌ను లిఫ్ట్ చేసిన ఎంజీఆర్ అసిస్టెంట్ మహాలింగం.. విషయాన్ని ఎంజీఆర్‌కు చేరవేశారు. దానికి ఎంజీఆర్ స్పందిస్తూ.. ‘నేను భోజనం చేస్తున్నాను. ప్రస్తుతం పాయసం తింటున్నాను’ అని సమాధానమిచ్చారు. అప్పట్లో ఆ మాట పతాకశీర్షికలకెక్కింది.

కరుణానిధిలో భయం పుట్టించిన ఎంజీఆర్‌?
వేగంగా మారుతున్న పరిణామాలు కరుణానిధికి మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. దాంతో ఆయన ఎంజీఆర్‌కు పోటీగా తన కుమారుడు ఎంకే ముత్తును వెండితెరకు పరిచయం చేశారు. ఎంజీఆర్‌కు సినిమా అవకాశాలు రాకుండా తెరవెనక మంత్రాంగం నెరిపారు. కరుణానిధి ఆదేశాలతో.. పోలీసులు కూడా ఎంజీఆర్ అభిమాన సంఘాలపై అణచివేత ధోరణిని కొనసాగించారు. ఎంకే ముత్తు అభిమాన సంఘాలు పెరిగేందుకు చర్యలు ప్రారంభించారు. ఎంజీఆర్‌ను అభిమానించే 700 ఫ్యాన్స్ క్లబ్ నేతలపై ఒత్తిడి మొదలైంది. ఈ పరిణామాలన్నీ ఎంజీఆర్‌కు మరింత చిరాకు పుట్టించాయి. దాంతో.. ఎంజీఆర్ వేరుకుంపటి ప్రకటన వెలువడింది. ఆ ప్రకటనతో వెనక్కి తగ్గిన కరుణానిధి ఓ అడుగు వెనక్కి తగ్గారు. ఎంకే ముత్తు ఫ్యాన్స్ క్లబ్‌లను రద్దు చేయాలని ఆదేశించారు. ఈ ఒక్క ఆదేశంతో డీఎంకేలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కరుణానిధి భయపడ్డారనే ప్రతికూల సందేశం దేశంలో వ్యాపించింది.

పురుడు పోసుకున్న అన్నాడీఎంకే
ఎంజీఆర్ అంతటితో ఆగలేదు. డీఎంకే పరిపాలనలో లోపాలను ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళ్లారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తారు. అవినీతి పాతుకుపోయిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మద్యపానం కారణంగా ప్రాణాలు పోతున్నాయంటూ సమాజానికి చాటిచెప్పారు. నిజానికి ఎంజీఆర్‌ను డీఎంకే నుంచి బహిష్కరించడం వల్ల ఆయనకు జరిగిన నష్టం లేదు కానీ.. డీఎంకే పార్టీ ఎంతగానో ప్రజాదరణను కోల్పోవడానికి కారణమైంది. తనను పార్టీ నుంచి బహిష్కరించిన ఏడాది కాలంలోనే.. అంటే.. 1972 అక్టోబరు 17న ఎంజీఆర్ అన్నాడీఎంకేను స్థాపించారు. 1986లో ఎంజీఆర్ భార్య జానకీరామచంద్రన్ పార్టీకి విరాళంగా చెన్నైలోని రాయపేటలో ఉన్న తన భవనాన్ని విరాళంగా ఇచ్చారు. అప్పటి నుంచి అయితే డీఎంకే.. లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లుగా తమిళ రాజకీయాలు కొనసాగాయి. ఎంజీఆర్ వారసురాలిగా 1989 నుంచి 2016 వరకు అన్నాడీఎంకేను జయలలిత నడిపించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement