ఎన్నికల రేసులో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు | encounter specialist joins election race | Sakshi
Sakshi News home page

ఎన్నికల రేసులో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు

Mar 31 2026 7:50 AM | Updated on Mar 31 2026 11:47 AM

encounter specialist joins election race

– చిన్నమ్మ పార్టీ తరపున పోటీ 

సాక్షి, చెన్నై : దివంగత సీఎం జే జయలలిత నెచ్చెలి శశికళ నేతృత్వంలోని అఖిల భారత పురట్చి తలైవర్‌ మక్కల్‌ మున్నేట్రకళగం అభ్యర్థిగా ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా పేరుగడించిన మాజీ పోలీసు అధికారి ఎస్‌. వెల్లదురై రంగంలోకి దిగారు. ఈ ఎన్నికలలో శశికళ పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసుతో కలిసి కూటమిగా ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులలో సోమవారం శశికళ జాబితాను ప్రకటించారు. 21 మందితో తొలి జాబితాను ఆమె ప్రకటించారు. 

ఇందులో శంకరన్‌ కోయిల్‌ నుంచి అన్నాడీఎంకే  మాజీ  ఎంపీ వసంతి మురుగేషన్‌ పోటీ చేస్తున్నట్టు తెలిపారు. మదురైలో చక్రవర్తి, తిరుచ్చి తూర్పులో నందకుమార్, రాజ పాళయంలో డాక్టర్‌ హరీష్‌  ముదుకులత్తూరులో రిటైర్డ్‌ అదనపు ఎస్పీ డాక్టర్‌ రాంకుమార్‌ పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే,పొత్తుల మేకు సాత్తూరు, ఆలంకులం నియోజకవర్గాలను పసుంపొన్‌ మక్కల్‌ దేశం కట్చి, నన్నిలం నియోజకవర్గాన్ని వెల్లలార్‌ మున్నేట్ర కళగంకుకు కేటాయించినట్టు వివరించారు.

 అదే సమయంలో శశికళ పార్టీ తరపున నాంగునేరిలో పోటీ చేస్తున్న అభ్యర్థిపై అందరి దృష్టి పడింది. పోలీసు శాఖలో రిటైఱ్డ్‌ ఎస్పీగా ఉన్న వెల్ల దురై ఇక్కడ అభ్యర్థి కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. స్మగ్లర్‌ వీరప్పన్‌ వేటలో కీలక పాత్ర పోషించిన  వెల్లదురై, తన సర్వీసులో ఎన్నో ఎన్‌కౌంటర్లలో పాల్గొని ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా గుర్తింపు పొందారు. అంతేకాదు, ఎన్నో సస్పెన్షన్లు, ట్రాన్స్‌ఫర్‌లు ఆయన ఖాతాలో ఉన్నాయి. తాజాగా ఎన్నికల రేసులో ఆయన దిగడంతో నాంగునేరి నియోజకవర్గంలో చర్చ మొదలైంది.   

Advertisement
 
Advertisement
Advertisement