చిన్నమ్మ మంతనాలు

చిన్నమ్మ మంతనాలు


సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ ఆగమేఘాలపై పార్టీ సీనియర్లను పోయెస్‌ గార్డెన్‌కు పిలిపించారు. సీఎం పన్నీరుసెల్వం తో పాటు పది మందికి పైగా మంత్రులు పోయెస్‌ గార్డెన్‌కు శుక్రవారం రాత్రి పరుగులు తీశారు. పార్టీ పరంగానూ, జల్లికట్టు విషయంగానూ వీరితో చిన్నమ్మ మంతనాలు సాగాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టినానంతరం పార్టీ పరంగా పట్టుకు చిన్నమ్మ శశికళ తీవ్రంగానే దూసుకెళ్తోన్నారు. జిల్లాల వారీగా సమీక్షలతో కసరత్తుల్ని ముగించారు. పార్టీ బలోపేతంతో పాటు, ఎంజీఆర్‌ శత జయంతి ఉత్సవాలకు తగ్గ చర్యల్ని తీసుకుని, ఆ దిశగా ముందుకు సాగే పనిలో ఉన్నారు.అదే సమయంలో చిన్నమ్మ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ దివంగత సీఎం జయలలిత మేన కోడలు దీపా వెన్నంటి నిలిచే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. మాజీ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు దీపా పేరవై బాట పడుతుండడం, తృతీయ శ్రేణి కేడర్‌ పెద్ద సంఖ్యలో అటు వైపుగా కదులుతుండటంతో వారిని నివారించేందుకు తగ్గవ్యూహ రచనలో చిన్నమ్మ ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉప్పెనలా జల్లికట్టు ఉద్యమం ఎగసి పడడంతో అత్యవసరంగా పరిస్థితిని చిన్నమ్మ సమీక్షించి ఉండడం గమనార్హం.చిన్నమ్మ మంతనాలు : చిన్నమ్మ పార్టీ పగ్గాలు చేపట్టినానంతరం ఆ పార్టీ కోశాధికారి, సీఎం పన్నీరు సెల్వం తీవ్ర సంకట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నట్టు సంకేతాలుఉన్నాయి. పలువురు మంత్రులు బహిరంగంగానే చిన్నమ్మ మా సీఎం అంటూ స్పందిస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో చిన్నమ్మ శశికళ సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయం అన్నట్టుగా తీవ్ర ప్రచారం రాష్ట్రంలో సాగుతోంది. ఈ సమయంలో ఆగమేఘాలపై సీఎం పన్నీరు సెల్వంను పోయెస్‌ గార్డెన్‌కు చిన్నమ్మ పిలిపించారు. అలాగే, పది మందికి పైగా మంత్రులు పోయెస్‌ గార్డెన్‌ మెట్లు ఎక్కారు.పార్టీలో సీనియర్లతో చర్చ అన్నట్టుగా ఈ సమావేశం సాగినా, సీఎం పన్నీరు సెల్వంతో పాటు సీనియర్‌ మంత్రులు, ఆయా జిల్లాలకు కార్యదర్శులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న  దిండుగల్‌ శ్రీనివాసన్, ఎడపాడి పళని స్వామి, తంగమణి, ఎస్పీ వేలుమణి, డి.జయకుమార్, ఎంసీ సంపత్, కామరాజ్, కడంబూరు రాజు, ఓఎస్‌ మణి, సరోజ శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి గంట పాటు చిన్నమ్మతో భేటీ కావడంతో ప్రాధాన్యం సంతరించుకున్నట్టు చెప్పవచ్చు. ప్రధానంగా పార్టీ , ప్రభుత్వానికి తలవంపులు రానివ్వకుండా జాగ్రత్తలు పడాలని, జల్లికట్టు విషయంలో యువత పెద్ద ఎత్తున ఏకం, కావడం, దీని వెనుక ఉన్న శక్తుల గురించి ఆరా తీసే విధంగా చిన్నమ్మ మంతనాలు సాగి ఉండడం గమనించాల్సిన విషయం. చిన్నమ్మతో భేటీ తదుపరి శనివారం జల్లికట్టు విషయంలో పన్నీరు ప్రభుత్వం ఆగమేఘాల మీద పావుల్ని కదపడం విశేషం.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top