అభివృద్ధిలో శీలం‘పూర్’ | Delhi elections 2015: Muslims in Seelampur may vote for change | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో శీలం‘పూర్’

Jan 21 2015 10:45 PM | Updated on Mar 18 2019 7:55 PM

జాతీయ రాజధానిలోని ఇతర ప్రాంతాలు అభివృద్ధి పధంలో దూసుకుపోతున్నప్పటికీ ఈశాన్యఢిల్లీ పరిధిలోని శీలంపూర్ ప్రాంత పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి

న్యూఢిల్లీ : జాతీయ రాజధానిలోని ఇతర ప్రాంతాలు అభివృద్ధి పధంలో దూసుకుపోతున్నప్పటికీ ఈశాన్యఢిల్లీ పరిధిలోని శీలంపూర్ ప్రాంత పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే రీతిలోనే ఉంది. 2013 విధానసభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఈ నియోజకవర్గంలోని రహదారుల పునర్నిర్మాణం జరిగినప్పటికీ మిగతా విషయాల్లో మాత్రం వెనుకబడిపోయింది. ఏదిఏమైనప్పటికీ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చౌదరి మతీన్ అహ్మద్ ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ప్రతి ఎన్నికల్లోనూ భారీ తేడాతోనే మతీన్ గెలుపొందుతున్నారని స్థానికులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల పవనాలు వీచినప్పటికీ 21 శాతం ఓట్ల తేడాతో మతీన్ 2013 ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల సంఖ్య అధికంగా ఉండడం మతీన్‌కు కలిసొచ్చిన అంశం. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఈ నియోజకవర్గంలో 60 నుంచి 65 శాతం మంది ఓటర్లు ఉన్నారు. ఇక పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గంలో ముస్లిం, హిందూ ఓటర్ల సంఖ్య దాదాపు సమానమైంది.
 
 అభివృద్ధికి అవకాశం అంతంతే
 శీలంపూర్ నియోజక వర్గంలోని అనధికార, రీసెటిల్మెంట్  కాలనీలతోపాటు మురికివాడలు అనేకం ఉన్నాయి. అయితే ఇక్కడ అభివృద్ధికి అవకాశం అంతగా లేదు. తగురీతిలో తాగునీటి సరఫరా జరగకపోవడం, మురుగుకాల్వల వెసులుబాటు అంతగా లేకపోవడంతో  స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే మతీన్ అహ్మద్ మాట్లాడుతూ ‘ఈ నియోజక వర్గంలో రహదారుల నిర్మాణం బాగానే జరిగింది. గోరక్‌పూర్ మురుగుకాల్వ పునర్నిర్మాణం జరిగితే మురుగునీటి సమస్య పరిష్కారమవుతుంది’ అని అన్నారు.
 
 ఎమ్మెల్యే చేసింది అంతంతే
 ఇదే విషయమై ముఖేష్‌కుమార్ అనే స్థానిక వ్యాపారి మాట్లాడుతూ ‘స్థానిక ఎమ్మెల్యే మతీన్ అందరికీ అందుబాటులో ఉంటారు. అయితే ఈ నియోజకవర్గానికి ఆయన చేసింది తక్కువే. అనేక సంవత్సరాలనుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తోంది. అయినప్పటికీ ఇక్కడ ఆ పార్టీ కౌన్సిలర్ లేరు’అని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న విధానసభ ఎన్నికల్లో అన్ని పార్టీలు ముస్లిం అభ్యర్థులనే బరిలోకి దించాయి. అయితే బీజేపీ మాత్రం హిందువుల ఓట్లను తన ఖాతాలో వేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడినుంచి సంజయ్ జైన్ అనే  అభ్యర్థికి టికెట్ ఇచ్చింది.
 
 బీజేపీకి మద్దతు పలకబోం
 రెండు దశాబ్దాలుగా ఈ నియోజక వర్గం అభివృద్ధికి నోచుకోకపోయినప్పటికీ బీజేపీకి ఓటు వేయబోమని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఈ నియోజక వర్గంలో ఆప్... జెండా ఎగురవేసినా విచిత్రమేమీ లేదు. ఇదే విషయమై మొయిన్ అహ్మద్ అనే స్థానికుడు మాట్లాడుతూ ‘గత ఎన్నికల దాకా కాంగ్రెస్‌కు ఓటేయడం తప్ప మరో మార్గం లేకపోయింది. ఆప్‌పై మాకు నమ్మకం కలగలేదు. అయినప్పటికీ ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకే ఓటు వేశాం. మాతో మమేకమయ్యేందుకు బీజేపీ ఏనాడూ యత్నించలేదు’ అని అన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement