రాష్ట్రపతితో ఆప్ ఎమ్మెల్యేల భేటీ | Arvind Kejriwal, AAP MLAs meet President Pranab Mukherjee, seek re-election in Delhi | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతితో ఆప్ ఎమ్మెల్యేల భేటీ

Sep 6 2014 10:13 PM | Updated on Mar 29 2019 9:04 PM

బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకునేందుకు ఆమ్‌ఆద్మీ పార్టీ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్యేల బేరసారాల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించింది.

బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకునేందుకు ఆమ్‌ఆద్మీ పార్టీ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్యేల బేరసారాల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించింది. ఈ మేరకు ఆప్ ఎమ్మెల్యేలు శనివారం సాయంత్రం  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించేందుకు ఎల్జీ నజీబ్‌జంగ్‌కు అనుమతి ఇవ్వవద్దని రాష్ట్రపతిని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి ఆహ్వానం అందకుండా చూస్తామని ఆప్ స్పష్టం చేసింది. ఇంతవరకు తమ గుప్పిట్లోనే ఉన్న ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయితే బేరసారాల ప్రభావానికి లొంగిపోవచ్చని ఆందోళన చెందుతోంది. అందుకే ప్రభుత్వం ఏర్పాటు ప్రయత్నాలను మొగ్గలోనే తుంచివేయాలని అనుకుంటోంది.
 
  ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇది పూర్తిగా తప్పని ఆప్ అగ్రనాయకుడు అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ‘ఢిల్లీలో మూడు పార్టీలు ఉన్నాయి. మూడింటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన సంఖ్యాబలం లేదు. అటువంటప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది ?  బీజేపీ ఒక్కో ఎమ్మెల్యేకు 20 కోట్ల రూపాయలు ఇవ్వజూపుతోంది’ అని ఆయన ఆరోపించారు. బేరసారాలకు ఎవరైనా వస్తే, వారితో మాట్లాడి మొత్తం సంభాషణలను రికార్డు చేయాలని కేజ్రీవాల్ తమ ఎమ్మెల్యేలకు సూచించారు. రాజీనామా చేయాలని కోరినా అందుకు అంగీకరించాలని తెలిపారు. స్టింగ్ ఆపరేషన్  టేపులను బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత, ప్రభుత్వ బలనిరూపణ మొదలయ్యేం దుకు ఒక గంటముందు బయటపెడతామని కేజ్రీవాల్ తెలిపారు.  సంఖ్యాబలం లేదని తెలిసికూడా ఎల్జీ ఏ ఆధారంతో బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు ఆహ్వానిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
 
 అనైతికంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా అందిస్తోన్న ఆహ్వానమేనని ఆయన ఆరోపించారు. అందుకే తాము రాష్ట్రపతి జోక్యం కోరామని వివరణ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి ఆహ్వానం అందకూడదని కేజ్రీవాల్ అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాన్ని బీజేపీకి కల్పిస్తే మెజారిటీ నిరూపించుకునేందుకు ఇద్దరేసి కాంగ్రెస్, ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు జరిపించాలని ఆప్ నేత మనీష్ సిసోడియా డిమాండ్ చేశారు ఎమ్మెల్యేల బేరసారాలతో బీజేపీ అధికారంలోకి రావడం ప్రమాదకరమని ఆయన చెప్పారు. డబ్బు వెదజల్లి అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఆ సొమ్ము వసూలు చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుందని సిసోడియా హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement