
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ పెద్దల్లో కుదిరిన ఏకాభిప్రాయం
త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్ష పదవికి వారసుడి ఎంపికపై సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పదవీ కాలం ముగియనుండటంతో నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం పార్టీ అధిష్ఠానం కసరత్తును వేగవంతం చేసింది.
ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా, రాజకీయ వర్గాల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన.. ముఖ్య మంత్రిగా మధ్యప్రదేశ్‌ను సుదీర్ఘకాలం పాలించిన అనుభవం ఉంది. ఆయన నిష్కళంక ప్రజా సేవ, సున్నితమైన ఇమేజ్, రాజకీయ అనుభవం ఈ పదవికి పోటీలో అగ్రస్థానంలో నిలబెట్టాయి.
ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం – విశ్వాసానికి ముద్ర
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి పలు పేర్లు వినిపిస్తున్నా, వాస్తవానికి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముందంజలో ఉన్నారు. 18 ఏళ్లపాటు సీఎంగా పనిచేసిన అనుభవం, ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం, మోదీ విశ్వాసం, ఓబీసీ నేపథ్యం ఇవన్నీ ఆయనకు అనుకూలంగా ఉన్నాయి. శివరాజ్ రాజకీయ ప్రయాణం ఆర్‌ఎస్‌ఎస్‌తోనే ప్రారంభమైంది. క్రమశిక్షణకు మారుపేరైన ఆయన క్రమంగా బీజేపీలో ఎదిగారు.
పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలక నిర్ణయాలను ప్రభావితం చేసే ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు శివరాజ్‌కు ప్లస్ పాయింట్. ఇటీవల ఆయన గ్వాలియర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో సుమారు 45 నిమిషాల పాటు భేటీ కావడం ఈ ఊహాగానాలకు బలాన్నిస్తోంది. అయితే ఈ భేటీకి ముందు కానీ, ఆ తరువాత కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా శివరాజ్ సింగ్ పార్టీ పట్ల తన నిబద్ధతను చాటారు.
పార్టీలోనూ ప్రాధాన్యం
1991లో మొదటిసారి లోక్‌సభకు ఎన్నికైన శివరాజ్ ఇప్పటివరకు ఆరు సార్లు ఎంపీగా గెలిచారు. 2024లో మరోసారి విజయంతో లోక్‌సభకు చేరి, కేంద్ర మంత్రివర్గంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖలను చేపట్టారు. గ్రామీణ భారత ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారించడం, రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ఆయన మంత్రిత్వ పనితీరులో ప్రధాన అంశాలు.
2024లో మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకార వేడుకలో శివరాజ్ ఐదవ స్థానంలో ప్రమాణం చేయడం గమనార్హం. 2005 నుంచి 2023 వరకు 18 సంవత్సరాల పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగడం ఆయన పరిపాలనా నైపుణ్యానికి నిదర్శనం. మధ్యలో 2018లో ఓటమి ఎదురైనా, 2020లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడంతో ఆయన రాజకీయ సామర్థ్యమేంటో తెలిసొచ్చింది.
శివరాజ్ ఓబీసీ వర్గానికి చెందినవారు. రాబోయే రోజుల్లో బీజేపీ మరింత విస్తరించడానికి ఈ వర్గంపై దృష్టి పెట్టాల ని భావిస్తోంది. ఆయన అధ్యక్షుడిగా వస్తే, పార్టీకి సామాజికంగానూ అదనపు బలం చేకూరుస్తుంది. ‘బీజేపీకి ప్రస్తుతం ప్రజలతో మమేకమయ్యే, కేడర్‌ను ఉత్సాహపరిచే, అలాగే జాతీయ స్థాయిలో అంగీకారం ఉన్న నాయకుడు కావాలి.
ఈ మూడు లక్షణాలు శివరాజ్‌లో ఉన్నాయి. ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ విశ్వాసం ఉండటం వల్ల ఆయనే తదు పరి అధ్యక్షుడయ్యే అవకాశం ఎక్కువ’అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ పెద్దల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పేరుపై ఏకాభిప్రాయం వచ్చిందని... త్వరలోనే పార్టీ అధిష్టానం ఆయన పేరును నూతన అధ్యక్షుడిగా ప్రకటి ంచే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.