తాజా ఎన్నికల కోసం నేటినుంచి నగరవ్యాప్తంగా సంతకాల ఉద్యమం | AAP to begin signature campaign on Wednesday demanding fresh polls in Delhi | Sakshi
Sakshi News home page

తాజా ఎన్నికల కోసం నేటినుంచి నగరవ్యాప్తంగా సంతకాల ఉద్యమం

Aug 12 2014 10:30 PM | Updated on Sep 2 2017 11:47 AM

ఢిల్లీ శాసన సభకు తాజాగా ఎన్నికలు జరపాలనే డిమాండ్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బుధవారం నుంచి నగరవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టనుంది.

 న్యూఢిల్లీ: ఢిల్లీ శాసన సభకు తాజాగా ఎన్నికలు జరపాలనే డిమాండ్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బుధవారం నుంచి నగరవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టనుంది. పత్పర్‌గంజ్ నియోజకవర్గంలో ప్రారంభమవనున్న ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు మనీష్ సిసోడియా, ఢిల్లీ కన్వీనర్ ఆశుతోశ్, రాష్ర్ట శాఖ కార్యదర్శి దిలీప్ పాండే తదితరులు పాల్గొననున్నారు. మరో పక్షం రోజులనాటికల్లా నగరంలోని 70 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆప్ లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల అవసరమేమిటో తెలియజేసేవిధంగా ఆప్ అధ్యక్షుడు అర్వింద్ కేజ్రీవాల్ సందేశంతో కూడిన ఫారాలను నగరవాసులకు ఈ సందర్భంగా అందజేస్తారు.
 
 ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అర్వింద్ కేజ్రీవాల్... ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే.  వాస్తవానికి గత ఎన్నికల సమయంలో మాదిరిగానే ఈ కార్యక్రమం పేరిట ప్రజలకు మరింత చేరువ కావాలనేది ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇటువంటి కార్యక్రమాలకు ఆ పార్టీ దూరంగా ఉండిపోయింది. ఏదిఏమైనప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించినమేర ఫలితాలను సాధించడంలో విఫలమయింది. మరోవైపు తమ పార్టీకి గల ప్రజాదరణను చాటుకునేందుకుగాను ఈ నెల మూడో తేదీన జంతర్‌మంతర్‌లో భారీ ర్యాలీ నిర్వహించిన కేజ్రీవాల్.. ఢిల్లీ శాసనసభకు వారం రోజుల గడువు ఇస్తున్నట్టు ప్రకటించారు. లేకపోతే సంతకాల సేకరణ ఉద్యమానికి శ్రీకారం చుడతామంటూ హెచ్చరించిన సంగతి విదితమే.
 
 కాగా  ఢిల్లీ శాసనసభ  సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యపడ లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement