వీరానం చెరువు జలకళ సంతరించుకుంది. ఫలితంగా చెన్నై వాసులకు నీటికష్టాలు తీరనున్నాయి. నీటిని నగరానికి పంపింగ్ చేయించే పనిలో నీటిపారుదలశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
47 అడుగులకు చేరిన ‘వీరానం’ నీటిమట్టం
Aug 14 2013 3:49 AM | Updated on Sep 1 2017 9:49 PM
వీరానం చెరువు జలకళ సంతరించుకుంది. ఫలితంగా చెన్నై వాసులకు నీటికష్టాలు తీరనున్నాయి. నీటిని నగరానికి పంపింగ్ చేయించే పనిలో నీటిపారుదలశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
సాక్షి, చెన్నై: చెన్నై మహానగరానికి రోజుకు 831 మిలియన్ లీటర్ల తాగునీరు అవసరం. పుళల్, పూండి, చోళవ రం, సెంబరబాక్కం, సెంగుండ్రం చెరువులు, కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోవిల్‌లోని వీరానం చెరువు నీటిని చెన్నైకి సరఫరా చేస్తున్నారు. అలాగే నిర్లవణీకరణ పథ కం ద్వారా సముద్రపు నీటిని శుద్ధీకరించి రోజుకు 170 మిలియన్ లీట ర్లు సరఫరా చేస్తున్నారు. అయితే వర్షాభావం కారణంగా వీరానం చెరువు ఎండిపోయింది. కండలేరు కాలువకు మరమ్మతులు జరుగుతుండడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో చెన్నై వాసులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. అధికారులు ఇది వరకు ప్రతి రోజూ నీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం రోజు మార్చి రోజు పంపిణీ చేస్తున్నారు. బోరు బావుల్ని ఏర్పాటు చేసి ఆ నీటిని నగరానికి అందిస్తున్నారు. ఈ క్రమంలో కండలేరు కాలువ పనులు పూర్తయ్యాయి. ఇక కండలేరు నీటి మీదే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
కరుణించిన కావేరి
కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోవిల్‌లోని వీరానం చెరువును చోళరాజుల హయూంలో నిర్మించారు. ఇక్కడి నుంచి నీళ్లు రెండు వందల కిలోమీటర్లకు పైగా పైప్‌లైన్ల ద్వారా పయనించి చెన్నై చేరతాయి. నగరంలో శుద్ధీకరణ అనంతరం ప్రజలకు అందిస్తారు. ఏడాదికి పైగా పూర్తిగా ఎండిపోయిన ఈ చెరువుకు కర్ణాటకలో కురిసిన వర్షాలు వరంగా మారాయి. కావేరి ఉగ్రరూపం దాల్చడంతో మెట్టూరు డ్యాం నిండింది.
దీంతో ఉబరి నీటిని విడుదల చేశారు. అలాగే నీటిని కాలువల ద్వారా వీరానం చెరువుకు మళ్లించారు. పదిహేను రోజుల వ్యవధిలో వీరానం నిండింది. పాతిక కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు నీటిమట్టం 47 అడుగులు. ప్రస్తుతం 44 అడుగులకు నీటిమట్టం చేరింది. మంగళవారానికి సెకనుకు 2753 ఘనపుటడుగుల నీళ్లు వచ్చాయి. వీరానం నిండడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని చెన్నైకి పంపింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
Advertisement


