అయ్యో... ఆఖరికి ఓడింది

Under 19 Bangladesh Team Won Under 19 World Cup Against India - Sakshi

టైటిల్‌ పోరులో యువ భారత్‌ ఓటమి

అండర్‌–19 ప్రపంచకప్‌ విజేత బంగ్లాదేశ్‌

‘డక్‌వర్త్‌’ పద్ధతిలో మూడు వికెట్లతో విజయం

యశస్వి పోరాటం వృథా

కుర్రాళ్ల కప్‌లో యువ భారత్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌. అన్నట్లుగానే ఈ హోదాకు న్యాయం చేసింది. అందరినీ ఓడించింది. ఆఖరిదాకా అజేయంగా నిలిచింది. చివరకు టైటిల్‌ పోరులో అనూహ్యంగా ఓడింది. ఐదోసారి విజేతగా నిలవాల్సిన జట్టు... తొలిసారి ఫైనల్‌ చేరిన బంగ్లాదేశ్‌ చేతిలో పరాజయం పాలైంది. ఇప్పుడు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. బంగ్లాదేశ్‌ కొత్త చాంపియన్‌గా అవతరించింది. సీనియర్, జూనియర్, పొట్టి, వన్డే ఇలా ఏ ఫార్మాట్‌ అయినా బంగ్లాదేశ్‌ ఐసీసీ ప్రపంచకప్‌ నెగ్గడం ఇదే తొలిసారి.

పాచెఫ్‌స్ట్రూమ్‌: బంగ్లాను బేబీ అంటే కుదరదేమో...! ప్రత్యేకించి ఈ ప్రపంచకప్‌లో! అందరినీ ఓడించి ఫైనల్‌ చేరిన బంగ్లాదేశ్‌ అమీతుమీలో నాలుగుసార్లు ప్రపంచకప్‌ విజేత, డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ను కంగుతినిపించింది. అజేయంగా సాగిన యువభారత్‌ ఆట అంతిమంగా పరాజయంతో ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 47.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (121 బంతుల్లో 88; 8 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేశాడు. బంగ్లాదేశ్‌ బౌలర్‌ అవిషేక్‌ దాస్‌ 3 వికెట్లు తీశాడు. తర్వాత కప్‌ కొట్టేందుకు 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 42.1 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి గెలిచింది. 41వ ఓవర్లో వర్షం రావడంతో కొంతసేపు మ్యాచ్‌ ఆగిపోయింది. అప్పటికి బంగ్లాదేశ్‌ 163/7 స్కోరుతో ఉంది. వర్షం తగ్గుముఖం పట్టాక బంగ్లాదేశ్‌ లక్ష్యాన్ని డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 46 ఓవర్లలో 170 పరుగులుగా కుదించారు. కెప్టెన్‌ అక్బర్‌ అలీ (77 బంతుల్లో 43 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయంగా నిలబడి గెలిపించాడు. రవి బిష్ణోయ్‌ 4 వికెట్లు తీశాడు. అక్బర్‌ అలీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, యశస్వి జైస్వాల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి.

ఆడింది యశస్వి ఒక్కడే... 
టాస్‌ నెగ్గిన బంగ్లాదేశ్‌ ఫీల్డింగ్‌కు మొగ్గు చూపింది. దీంతో భారత్‌ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన యశస్వి జైస్వాల్, దివ్యాంశ్‌ సక్సేనా ఓపెనింగ్‌ జోడీ విఫలమైంది. స్కోరు పదైనా  కాకముందే సక్సేనా (2)ను అవిషేక్‌ ఔట్‌ చేశాడు. అయితే హైదరాబాద్‌ కుర్రాడు ఠాకూర్‌ తిలక్‌ వర్మ (65 బంతుల్లో 38; 3 ఫోర్లు)తో కలిసి యశస్వి ఇన్నింగ్స్‌ నడిపించాడు. ఈ జోడీ సఫలమైతే అయింది కానీ పరుగుల రాకే మందగమనంగా సాగింది. దీంతో జట్టు స్కోరు 50 చేసేందుకే 16.1 ఓవర్లు అవసరమైంది. ఏదేమైనా బంగ్లా బౌలింగ్‌ను చిర్రెత్తిస్తూ నిదానంగా సాగిన ఈ భాగస్వామ్యం బలపడింది. యశస్వి 89 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు కూడా 29వ ఓవర్లో వందకు చేరింది. కాసేపటికే తిలక్‌వర్మ ఆటను తన్జీమ్‌ హసన్‌ షకీబ్‌ ముగించడంతో 94 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. కెప్టెన్‌ ప్రియమ్‌ గార్గ్‌ (7) విఫలమయ్యాడు.

జైస్వాల్‌ ఔటయ్యాక ఆలౌట్‌... 
ధ్రువ్‌ జురెల్‌ (38 బంతుల్లో 22; 1 ఫోర్‌)ను కలుపుకొని చక్కని పోరాటం చేశాడు జైస్వాల్‌. జాగ్రత్తగా ఆడటంతో స్కోరు జోరందుకోలేకపోయింది. 39వ ఓవర్లో భారత్‌ 150 పరుగులు దాటింది. ఆ తర్వాత యశస్వి ఔటయ్యాడు. దీంతోపాటే భారత్‌ ఇన్నింగ్స్‌ కూలడం కూడా మొదలైంది. సిద్ధేశ్‌ వీర్‌ (0), జురెల్, అథర్వ అంకోలేకర్‌ (3), రవి బిష్ణోయ్‌ (2), సుశాంత్‌ మిశ్రా (3), కార్తీక్‌ త్యాగి (0) స్వల్ప వ్యవధిలోనే వికెట్లను సమర్పించుకోవడంతో నిర్ణీత ఓవర్లు ఆడకుండానే భారత్‌ 47.2 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. చిత్రంగా 21 పరుగుల తేడాలో 7 వికెట్లను కోల్పోయింది. షరీఫుల్‌ ఇస్లామ్‌ (2/31), తన్జీమ్‌ హసన్‌ షకీబ్‌ (2/28) భారత్‌ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశారు.

ఆశలు రేపిన బిష్ణోయ్‌... 
బంగ్లా ఈ మెగా ఈవెంట్‌లో ఆడిన జోరును చూస్తే ఇది చాలా సునాయాస లక్ష్యం. అందుకు తగ్గట్లే ఓపెనర్లు పర్వేజ్‌ (79 బంతుల్లో 47; 7 ఫోర్లు), హసన్‌ షకీబ్‌ (17) తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించి చక్కని ఆరంభమిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత బౌలర్‌ రవి బిష్ణోయ్‌ స్వల్ప వ్యవధిలో చకచకా 4 వికెట్లు తీసి కుర్రాళ్లలో ఆశలు పెంచాడు. పర్వేజ్‌ రిటైర్డ్‌హర్ట్‌ అవ్వగా... తన్జీద్, మహ్ముదుల్‌ (8), తౌహిద్‌ (0), షహదత్‌ (1)లను 3 పరుగుల వ్యవధిలోనే అవుట్‌ చేశాడు. 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. షమీమ్‌ (7), తర్వాత కాసేపటికి అవిషేక్‌ దాస్‌ (5) కూడా అవుట్‌ కావడంతో 102 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో ఓపెనర్‌ పర్వేజ్‌ మళ్లీ బ్యాటింగ్‌కు దిగి మెరుపులు మెరిపించాడు. ఇతన్ని యశస్వి అవుట్‌ చేయగా... రకీబుల్‌ (9 నాటౌట్‌) అండతో కెప్టెన్‌ అక్బర్‌ అలీ  లక్ష్యాన్ని పూర్తి చేశాడు. సుశాంత్‌ మిశ్రాకు 2 వికెట్లు దక్కాయి.  భారత బౌలర్లు ఏకంగా 33 ఎక్స్‌ట్రాలు ఇవ్వడం గమనార్హం.

ఫైనల్‌ రోజు మాకు కలిసిరాలేదు. మా బౌలర్లు చక్కగా పోరాడారు. తక్కువ లక్ష్యమే అయినప్పటికీ చివరి వరకు చక్కగా బంగ్లాను నియంత్రించారు. బ్యాటింగ్‌లో మాకు మంచి ఆరంభం లభించింది. కానీ ఉపయోగించుకోలేకపోయాం. 210–220 పరుగులు చేయాల్సింది. బ్యాటింగ్‌ సరిగా చేయలేకపోవడం వల్లే మేం టైటిల్‌ చేజార్చుకున్నాం. –ప్రియమ్‌ గార్గ్, భారత కెప్టెన్‌


మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ యశస్వి జైస్వాల్‌
యశస్వి ఈ టోర్నీలో మొత్తం 6 మ్యాచ్‌లు ఆడి 400 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో అతను మూడు వికెట్లు కూడా తీశాడు. భారత్‌కే చెందిన రవి బిష్ణోయ్‌ (6 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: యశస్వి జైస్వాల్‌ (సి) తన్జీద్‌ (బి) షరీఫుల్‌ 88; దివ్యాంశ్‌ సక్సేనా (సి) మహ్ముదుల్‌ (బి) అవిషేక్‌ దాస్‌ 2; తిలక్‌వర్మ (సి) షరీఫుల్‌ (బి) షకీబ్‌ 38; ప్రియమ్‌ గార్గ్‌ (సి) తన్జీద్‌ (బి) రకీబుల్‌ 7; ధ్రువ్‌ జురెల్‌ (రనౌట్‌) 22; సిద్ధేశ్‌ వీర్‌ ఎల్బీడబ్ల్యూ (బి) షరీఫుల్‌ 0; అథర్వ అంకోలేకర్‌ (బి) అవిషేక్‌ దాస్‌ 3; రవి బిష్ణోయ్‌ (రనౌట్‌) 2; సుశాంత్‌ (సి) షరీఫుల్‌ (బి) షకీబ్‌ 3; కార్తీక్‌ త్యాగి (సి) అక్బర్‌ అలీ (బి) అవిషేక్‌ దాస్‌ 0; ఆకాశ్‌ సింగ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (47.2 ఓవర్లలో ఆలౌట్‌) 177. 
వికెట్ల పతనం: 1–9, 2–103, 3–114, 4–156, 5–156, 6–168, 7–170, 8–170, 9–172, 10–177. బౌలింగ్‌: షరీఫుల్‌ 10–1–31–2, తన్జీమ్‌ షకీబ్‌ 8.2–2–28–2, అవిషేక్‌ దాస్‌ 9–0–40–3, షమీమ్‌ 6–0–36–0, రకీబుల్‌ 10–1–29–1, తౌహిద్‌ 4–0–12–0

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: పర్వేజ్‌ (సి) ఆకాశ్‌ (బి) యశస్వి 47; తన్జీద్‌ (సి) కార్తీక్‌ త్యాగి (బి) రవి బిష్ణోయ్‌ 17; మహ్ముదుల్‌ హసన్‌ జాయ్‌ (బి) రవి బిష్ణోయ్‌ 8; తౌహిద్‌ ఎల్బీడబ్ల్యూ (బి) రవి బిష్ణోయ్‌ 0; షహదత్‌ (స్టంప్డ్‌) జురెల్‌ (బి) రవి బిష్ణోయ్‌ 1; అక్బర్‌ అలీ (నాటౌట్‌) 43; షమీమ్‌ (సి) యశస్వి (బి) సుశాంత్‌ మిశ్రా 7; అవిషేక్‌ దాస్‌ (సి) కార్తీక్‌ త్యాగి (బి) సుశాంత్‌ మిశ్రా 5; రకీబుల్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 33; మొత్తం (42.1 ఓవర్లలో 7 వికెట్లకు) 170. 
వికెట్ల పతనం: 1–50, 2–62, 3–62, 4–65, 5–85, 6–102, 7–143 బౌలింగ్‌: కార్తీక్‌ త్యాగి 10–2–33–0, సుశాంత్‌ మిశ్రా 7–0–25–2, ఆకాశ్‌ సింగ్‌ 8–1–33–0, రవి బిష్ణోయ్‌ 10–3–30–4, అథర్వ 4.1–0–22–0, యశస్వి జైస్వాల్‌ 3–0–15–1.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top