‘నేను స్మిత్‌ కెప్టెన్సీకి సహకరిస్తా’

Tim Paine Backs Smiths Return To Captaincy - Sakshi

మెల్‌బోర్న్‌: బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలతో గతేడాది నిషేధానికి గురైన ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ కొన్ని నెలల క్రితం పునరాగమనం చేశాడు. 12 నెలల పాటు నిషేధం ఎదుర్కొన్న స్మిత్‌.. ఆపై క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ కెప్టెన్సీ పదవికి మాత్రం దూరమయ్యాడు. అయితే యాషెస్‌ సిరీస్‌లో విశేషంగా రాణించిన తర్వాత స్మిత్‌కు మళ్లీ కెప్టెన్సీ అప్పచెప్పలనే వాదన తెరపైకి వచ్చింది. ఆసీస్‌ ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌.. స్మిత్‌ నాయకత్వ సామర్థ్యాన్ని ప్రశంసించాడు. స్మిత్‌ ఒక తెలివైన కెప్టెన్‌ అంటూ కొనియాడాడు. దాంతో స్మిత్‌కు సారథ్య బాధ్యతలు ఇవ్వడం ఖాయమంటూ వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం ఆసీస్‌ టెస్టు కెప్టెన్‌ ఉన్న టిమ్‌ పైన్‌.. ఇక దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి అనివార్యం కానుందని కొంతమంది అభిప్రాయపడ్డారు. దీనిపై తాజాగా స్పందించిన పైన్‌.. ‘ ప్రస్తుత సమయంలో ఆసీస్‌ కెప్టెన్సీ పదవిని ఎంజాయ్‌ చేస్తున్నా. ఏదొక రోజు స్మిత్‌ మళ్లీ పగ్గాలు అందుకుంటాడనే ఆశిస్తున్నా. స్మిత్‌ను కెప్టెన్‌గా తిరిగి నియమిస్తే నాకు అభ్యంతరం ఏమీ లేదు. నేను స్మిత్‌ కెప్టెన్సీకి సహకరిస్తా’ అని పేర్కొన్నాడు. అయితే కెప్టెన్సీ కోసం బీబీఎల్‌ను వదిలేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం పైన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘నాకు ఆసీస్‌ తరఫున టెస్టు క్రికెట్‌  ఆడటం చాలా ముఖ్యమైనది. జట్టును ముందుండి నడిపించడంపైనే దృష్టి పెడుతున్నా.  దాంతో బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)ను వదిలేయాలని నిర్ణయించుకున్నా.  ఒక కెప్టెన్‌గా నాకొచ్చి ప్రతీ చాన్స్‌ను  వినియోగించుకోవాలంటే నేను రీచార్జ్‌ కావాల్సి ఉంది. ఆ క్రమంలోనే బీబీఎల్‌కు స్వస్తి చెబుదామని అనుకుంటున్నా.  నా టెస్టు కెరీర్‌ ముగిసిన తర్వాతే బీబీఎల్‌లో అడుగుపెడతా. ప్రస్తుతం నా దృష్టంతా నాపై ఉన్న బాధ్యతపైనే’ అని పైన్‌ ఇటీవల పేర్కొన్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top