వచ్చే డిసెంబర్‌లో తమతో ఆడాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌ను రద్దు చేసుకుంటే ఇక భవిష్యత్‌లో భారత్‌తో మ్యాచ్‌లు ఆడబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హెచ్చరించింది
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హెచ్చరిక
కరాచీ : వచ్చే డిసెంబర్‌లో తమతో ఆడాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌ను రద్దు చేసుకుంటే ఇక భవిష్యత్‌లో భారత్‌తో మ్యాచ్‌లు ఆడబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హెచ్చరించింది. ఐసీసీ, ఆసియా కప్ ఈవెంట్లలో జరిగే మ్యాచ్‌లను బహిష్కరిస్తామని వెల్లడించింది. ఇంతవరకు సిరీస్ కోసం భారత క్రీడాశాఖతో అనుమతి తీసుకునే ప్రయత్నం బీసీసీఐ చేయకపోవడం బాధ కలిగిస్తోందని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ విమర్శించారు. ‘ఇప్పటి వరకు ఏదీ తేలలేదు. అయితే భారత బోర్డు అధికారికంగా సిరీస్ నుంచి వైదొలిగితే... మేం ఇతర టోర్నీల్లో వారితో ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లను బహిష్కరిస్తాం.
డిసెంబర్ దగ్గరకు వస్తోంది. ఏదో ఒక స్పష్టమైన నిర్ణయాన్ని బోర్డు మాకు తెలపాలి. మేం ఆగస్టు 28న అధికారికంగా ఓ లేఖ కూడా రాశాం. దానిపై స్పందన కోసం ఎదురుచూస్తున్నాం. ఆడతారో, లేదో చెప్పాల్సిన బాధ్యత వాళ్లపై ఉంది. ద్వైపాక్షిక సిరీస్ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ పోతే మేం కూడా దానికి తగ్గట్లుగానే నిర్ణయం తీసుకుంటాం’ అని ఖాన్ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉన్న బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్... ఇండో-పాక్ సిరీస్ గురించి నెగెటివ్‌గా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థంకావడం లేదన్నారు.