బ్యాటింగ్‌ కోచ్‌ ఎవరో?

Team India coach selections - Sakshi

కొనసాగుతున్న ఇంటర్వ్యూలు 

ముంబై: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి పేరు ఖరారైన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఇతర సహాయక సిబ్బందిపై పడింది. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ కోచ్‌లను ఎంపిక చేసేందుకు బీసీసీఐ కసరత్తు ప్రారంభించింది. సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని బృం దం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. సోమవారం ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, గురువారం వరకు కొనసాగే అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం ఎంపికైనవారి జాబితాను ప్రకటిస్తారు. ఈ ఎంపిక విషయంలో రవిశాస్త్రి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారా లేక ఎంపిక కమిటీ తమదైన శైలిలో తగిన వ్యక్తులను ఎంపిక చేస్తుందా అనేది ఆసక్తికరం.  

ముందంజలో విక్రమ్‌ రాథోడ్‌ ...
2014 నుంచి భారత బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్న సంజయ్‌ బంగర్‌ పనితీరు నిజానికి బాగుంది. చాలా మంది బ్యాట్స్‌మెన్‌ అతని హయాంలో తమ ఆటతీరు మెరుగైందని, సాంకేతిక విషయాల్లో కూడా లోపాలు తీర్చిదిద్దారని బహిరంగంగానే చెప్పారు. అయినా సరే బంగర్‌ పదవి భద్రంగా లేదు. అనేక మంది దీని కోసం పోటీ పడుతున్నారు. కారణాలేమైనా రవిశాస్త్రి కూడా భరత్‌ అరుణ్, ఆర్‌. శ్రీధర్‌ల గురించి మాట్లాడినంత సానుకూలంగా బంగర్‌ గురించి చెప్పలేదు. దాంతో కొత్త వ్యక్తికి అవకాశం దక్కవచ్చని వినిపిస్తోంది. హెడ్‌ కోచ్‌ పదవికి ప్రయత్నించి విఫలమైన లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ ఈసారి బ్యాటింగ్‌ కోచ్‌ కోసం తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే అంతర్గత సమాచారం ప్రకారం మాజీ ఓపెనర్‌ విక్రమ్‌ రాథోడ్‌ వైపు ఎక్కువగా మొగ్గు కనిపిస్తోంది. వీరిద్దరితో పాటు ప్రవీణ్‌ ఆమ్రే, అమోల్‌ మజుందార్‌ కూడా గట్టి పోటీనిస్తున్నారు. సౌరాష్ట్ర కోచ్‌ సితాన్షు కొటక్, హృషికేశ్‌ కనిత్కర్, మిథున్‌ మన్హాస్‌ కూడా ఇంటర్వ్యూకు హాజరు కానున్నారు. 

రోడ్స్‌కు కష్టమే!
బౌలింగ్‌ కోచ్‌ పదవి కోసం ప్రస్తుత కోచ్‌ భరత్‌ అరుణ్‌తో పాటు వెంకటేశ్‌ ప్రసాద్, పారస్‌ మాంబ్రే, అమిత్‌ భండారి బరిలో ఉన్నారు. వీరంతా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. మరోవైపు జాంటీ రోడ్స్‌లాంటి దిగ్గజం పోటీలో నిలిచినా ప్రస్తుత ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌. శ్రీధర్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదని తెలుస్తోంది. ఇన్నేళ్లుగా భారత్‌ ఫీల్డింగ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దిన శ్రీధర్‌కు రవిశాస్త్రి అండదండలు ఉండటమే దీనికి కారణం. టీమిండియా ప్రస్తుత ప్రమాణాలు శ్రీధర్‌ ఘనతే కాబట్టి రోడ్స్‌ స్థాయి వ్యక్తి అయినా సరే అనవసరమనే భావన కనిపిస్తోంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top