మళ్లీ ‘తిప్పుడే’!

మళ్లీ ‘తిప్పుడే’!


తొలి టెస్టులో ‘స్పిన్’ అస్త్రంతో దక్షిణాఫ్రికాకు మంత్రం వేసిన భారత్... రెండో టెస్టుకూ అదే ‘తంత్రాన్ని’ ఉపయోగించనుంది. సాధారణంగా పేస్, బౌన్స్‌కు అనుకూలించే చిన్నస్వామి వికెట్‌పై ఈసారి మాత్రం బంతిని గింగరాలు తిప్పేందుకు రంగం సిద్ధం చేసింది. అవసరమైతే నాలుగో స్పిన్నర్‌తో అదును చూసి ప్రొటీస్‌ను దెబ్బతీయాలని టీమిండియా భావిస్తుంటే... ఎలాగైనా భారత్ ‘త్రయాన్ని’ నిలువరించాలని సఫారీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

 

* నేటి నుంచి భారత్, దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్టు

* ఆత్మవిశ్వాసంలో కోహ్లిసేన

* తుది జట్టులో ఇషాంత్!

* లెక్కసరిచేయాలని ప్రొటీస్ తాపత్రయం

 

ఉ.గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో  ప్రత్యక్ష ప్రసారంబెంగళూరు: స్పిన్ వికెట్‌పై తొలి టెస్టులో దక్షిణాఫ్రికాకు షాకిచ్చిన భారత జట్టు మరోసారి దాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. నేటి (శనివారం) నుంచి చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభంకానున్న రెండో టెస్టులో సఫారీలతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. మూడు రోజు ల్లోనే తొలి టెస్టును ముగించి ఆత్మవిశ్వాసంతో ఉన్న కోహ్లిసేన ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌లో పైచేయి సాధించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.ఇందుకోసం తుది జట్టులో ఒక మార్పు చేయనుంది. పేసర్లలో వరుణ్ ఆరోన్ స్థానంలో ఇషాంత్‌ను తుది జట్టులోకి తీసుకురానుంది. అయితే అనూహ్యంగా జట్టులోకి వచ్చిన గురుకీరత్‌ను నాలుగో స్పిన్నర్‌గా ఆడిస్తారా? లేదా? అన్నది చూడాలి. ఆల్‌రౌండర్‌గా గురుకీరత్‌కు అవకాశం ఇస్తే మిశ్రా బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఓపెనింగ్‌లో శిఖర్ ధావన్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో అతను డకౌట్ కావడంతో ఒత్తిడి మరింత పెరిగిపోయింది.శిఖర్ స్థానంలో లోకేశ్ రాహుల్‌ను తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తున్నా.. విరాట్ ఇప్పటికిప్పుడు మార్పు కోరుకోకపోవచ్చు. రెండో ఓపెనర్‌గా మురళీ విజయ్ ఆకట్టుకుంటున్నాడు. వన్‌డౌన్‌లో పుజారా నిలకడను చూపెడుతున్నా... కోహ్లి, రహానే ఇంకా గాడిలో పడాల్సి ఉంది. ఈ ఇద్దరి పేలవ ఫామ్‌తో భారత్ భారీ స్కోరు చేయలేకపోతోంది. గత నాలుగు టెస్టులో టీమిండియా 400 స్కోరు దాటకపోవడం కూడా విరాట్‌ను కలవరపెడుతోంది. ఆల్‌రౌండర్‌గా జడేజా పూర్తి న్యాయం చేస్తున్నాడు.ప్రధాన స్పిన్నర్ అశ్విన్‌పై ఒత్తిడి తగ్గించడమే కాకుండా కీలక సమయంలో బ్యాట్‌తో పరుగులూ చేస్తున్నాడు. ఈ ఇద్దరికి తోడు మిశ్రా ఇంకాస్త కుదురుకుంటే ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా విజయం నల్లేరు మీద నడకే. తొలి టెస్టుల్లో ఈ త్రయం 19 వికెట్లు తీయడంతో మరోసారి ఆశలన్నీ వీరిపైనే ఉన్నాయి. జడేజా తర్వాత లోయర్ ఆర్డర్‌లో అశ్విన్, మిశ్రా, ఉమేశ్‌లు బ్యాటింగ్ చేయలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

 

డుమిని సిద్ధం

మరోవైపు టి20, వన్డే సిరీస్‌ల్లో జోరు చూపెట్టిన దక్షిణాఫ్రికాను గాయాలు వేధిస్తున్నాయి. ప్రధాన బౌలర్లు, స్టెయిన్, ఫిలాండర్‌లు ఇప్పటికే జట్టుకు దూరం కావడంతో పేస్ అటాక్ బాగా బలహీనపడింది. టి20, వన్డే సిరీస్‌ల్లో ప్రభావం చూపిన రబడ ఈ ఫార్మాట్‌లో తేలిపోతున్నాడు. హార్మర్ స్థానంలో అబాట్‌ను తీసుకోవాలని మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. తొలి టెస్టుకు దూరమైన డుమిని రాకతో బ్యాటింగ్ మరింత బలోపేతం అయ్యింది.కెరీర్‌లో ‘వందో టెస్టు’ ఆడబోతున్న డివిలియర్స్ కు గెలుపు కానుకగా ఇవ్వాలని ఆమ్లా భావిస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేటట్లు లేదు. ఓపెనర్లు శుభారంభం ఇవ్వడంలో విఫలమవుతున్నారు. డు ప్లెసిస్, ఆమ్లా, విలాస్‌లు భారీ స్కోరు చేయాలని భావిస్తున్నా... స్పిన్ పిచ్ ఎదురైతే వీళ్లు ఎలా ఆడతారన్నది వేచి చూడాలి. ప్రధాన స్పిన్నర్ తాహిర్ మ్యాజిక్ చూపెడుతున్నా.. పార్ట్‌టైమర్లు సరైన సహకారం అందించడం లేదు. ఓవరాల్‌గా మరోసారి స్పిన్ పిచ్‌పైనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

 

జట్లు (అంచనా):

భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, విజయ్, పుజారా, రహానే, సాహా, జడేజా, మిశ్రా, అశ్విన్, ఉమేశ్, ఇషాంత్.

దక్షిణాఫ్రికా: ఆమ్లా (కెప్టెన్), ఎల్గర్, వాన్ జెల్, డు ప్లెసిస్, డివిలియర్స్, డుమిని, విలాస్, హార్మర్ / అబాట్, రబడ, మోర్నీ మోర్కెల్, తాహిర్.

 

పిచ్

సాధారణంగా బెంగళూరులో తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా పిచ్ ఉంటుంది. అయితే ఈసారి ఇక్కడ కూడా స్పిన్నర్లకు సహకారం లభించేలా రూపొందించారని సమాచారం. అయితే ఎంత స్పిన్ వికెట్ అయినా తొలి రోజు బ్యాటింగ్‌కు ఇబ్బంది ఉండకపోవచ్చు. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ చేయొచ్చు.

 

వాతావరణం

గత కొన్ని రోజులుగా బెంగళూరులో వర్షాలు కురుస్తున్నాయి. శని వారం కూడా ఆకాశం మేఘావృతంగా ఉంటుందని వాతావరణ నివేదిక. ఓవరాల్‌గా ఏదో ఒక దశలో వర్షం మ్యా చ్‌కు అంతరాయం కలిగించవచ్చు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top