బ్రాత్‌వైట్‌ మురిసే.. స్టోక్స్‌ ఏడిచే

T20 World Cup 2016 Final: Brathwaite Smashes Stokes For 4 Sixes - Sakshi

లక్ష్యం 156 పరుగులు.. 107 పరుగులకే ఆరు వికెట్లు.. ఊరిస్తున్న లక్ష్యం..అడుగు దూరంలో ప్రపంచకప్‌.. బంతులా లేక బుల్లెట్‌లా అన్నట్లు ప్రత్యర్థి బౌలింగ్‌.. ఇది వెస్టిండీస్‌ పరిస్థితి. అయితే ఎవరూ ఊహించని విధంగా మహాఅద్భుతం జరిగింది. కాదు మహాద్భుతం జరిగేలా చేశాడు. అతడే కార్లోస్‌ బ్రాత్‌వైట్‌. ఆశలు చనిపోయిన స్థితి నుంచి ప్రతీ ఒక్క కరేబియన్‌ అభిమాని కాలర్‌ ఎగరేశాలా చేశాడు. అయితే బ్రాత్‌వైట్‌ ధాటికి బలైన బౌలర్‌ మాత్రం కొన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపాడు. అతడే బెన్‌ స్టోక్స్‌. అభిమానులకు అసలు సిసలైన టీ20 మజాను అందించిన ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌ వేదికైంది. ఆ మహా సమరం జరిగింది ఇదే రోజు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు మీకోసం..

సెమీఫైనల్లో టీమిండియాపై గెలిచి రెట్టింపు ఉత్సాహంతో ఫైనల్లో ఇంగ్లండ్‌ పోరుకు వెస్టిండీస్‌ సిద్దమైంది. టాస్‌ గెలిచిన విండీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. జాసర్‌ రాయ్‌(0), అలెక్స్‌ హేల్స్‌(1), ఇయాన్‌ మోర్గాన్‌(5)లు ఘోరంగా నిరుత్సాహపరచడంతో బ్రిటీష్‌ జట్టు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జోయ్‌ రూట్‌(54) బాధ్యతాయుతంగా ఆడాడు. రూట్‌కు తోడు బట్లర్‌(36) ఫర్వాలేదనిపించాడు. చివర్లో డేవిడ్‌ విల్లీ(21) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో బ్రావో, బ్రాత్‌వైట్‌ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. బద్రీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. 

శాముల్స్‌ ఒకేఒక్కడు..
ఇంగ్లండ్‌ విధించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్‌ జట్టుకు ఇంగ్లండ్‌ ఆదిలోనే షాక్‌ ఇచ్చింది. చార్లెస్‌(1), గేల్‌(4), సిమ్మన్స్‌(0) రస్సెల్‌(1), డారెన్‌ సామీ(2)లను వరుసగా పెవిలియన్‌కు పంపించి విండీస్‌ను పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఈ కష్టకాలంలో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ శాముల్స్‌(85నాటౌట్‌) ఒకే ఒక్కడు నిలబడ్డాడు. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నా మరోవైపు ఒంటిరి పోరాటం చేశాడు. శాముల్స్‌కు బ్రావో(25) చక్కటి సహకారం అందించినా చివరి వరకు నిలబడలేకపోయాడు. అయితే రన్‌రేట్‌ పెరిగిపోతుండటంతో విండీస్‌ గెలుపు ఆశలు సన్నగిల్లాయి. 

బ్రాత్‌వైట్‌ విధ్వంసం
12 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన సమయంలో క్రిస్‌ జోర్డాన్‌ వేసిన 19వ ఓవర్‌లో శాముల్స్‌, బ్రాత్‌వైట్‌లు తడబడ్డారు. దీంతో ఆ ఓవర్‌లో 8 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో చివరి ఓవర్‌లో విండీస్‌ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో బెన్‌ స్టోక్స్‌ వేసిన చివరో ఓవర్‌లో బ్రాత్‌వైట్‌ విధ్వంసం సృష్టించాడు. వరుసగా నాలుగు బంతులను భారీ సిక్సర్లుగా మలచి విండీస్‌కు విజయాన్ని, ప్రపంచకప్‌ను అందించిపెట్టాడు. బ్రాత్‌వైట్‌(34 నాటౌట్‌) వరుసగా సిక్సర్లు కొట్టడంతో షాక్‌కు గురైన బెన్‌ స్టోక్స్‌ మైదానంలో కన్నీటిపర్యంతమయ్యాడు. ఇలా ఎన్నో విశేషాలు కలిగిన ఈ ప్రపంచకప్‌ ఫైనల్‌ జరిగింది ఇదే రోజు కావడంతో ఐసీసీ ట్వీట్‌ చేసింది. అంతేకాకుండా బ్రాత్‌వైట్‌ సిక్సర్లకు సంబంధించిన వీడియోనూ సైతం పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  

చదవండి:
ఆమెకు పెద్ద ఫ్యాన్‌ అయిపోయాను
ఏంటి నీ వేషాలు.. కోహ్లితో చెప్పాలా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top