దిమ్మ తిరిగింది! | srilanka beat india in Champions Trophy | Sakshi
Sakshi News home page

దిమ్మ తిరిగింది!

Jun 9 2017 12:37 AM | Updated on Sep 5 2017 1:07 PM

దిమ్మ తిరిగింది!

దిమ్మ తిరిగింది!

చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించి అమితోత్సాహంతో ఉన్న టీమిండియాకు ఊహించని షాక్‌

శ్రీలంక చేతిలో భారత్‌ చిత్తు
ఏడు వికెట్లతో ఓడిన కోహ్లి సేన 
చెలరేగిన మెండిస్, గుణతిలక
ధావన్‌ సెంచరీ వృథా   


చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించి అమితోత్సాహంతో ఉన్న టీమిండియాకు ఊహించని షాక్‌... ఇప్పటి వరకు టోర్నీలో ఏ మాత్రం అవకాశాలు లేని జట్ల జాబితాలో నిలిచిన శ్రీలంక అద్భుత ఆటతో భారత్‌ను పడగొట్టేసింది. 300కు పైగా పరుగులు చేశామని, పేస్‌ బలగం బాగుందని ధీమాగా ఉన్న టీమిండియాను లంక యువ క్రికెటర్లు ఒక ఆటాడుకున్నారు. అలవోకగా పరుగులు సాధించి తమ జట్టుకు అనూహ్య విజయాన్ని అందించారు.

ముందుగా శిఖర్‌ ధావన్‌ సూపర్‌ సెంచరీకి తోడు రోహిత్, ధోని మెరుపులతో భారత్‌ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. తర్వాత ఐదు ఓవర్లలోపే తొలి వికెట్‌ కూడా పడగొట్టారు. కానీ కుషాల్‌ మెండిస్, గుణతిలక భారీ భాగస్వామ్యంతో చెలరేగగా, కుషాల్‌ పెరీరా అండతో కెప్టెన్‌ మ్యాథ్యూస్‌ చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. లంక బ్యాట్స్‌మెన్‌లో ఇద్దరు రనౌట్, ఒకరు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగ్గా, వారి బ్యాటింగ్‌ జోరు ముందు మన బౌలర్ల ప్రదర్శన తేలిపోయింది.  

లండన్‌: చాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. టోర్నీలో బలహీనంగా కనిపించిన శ్రీలంక దూకుడైన బ్యాటింగ్‌తో కోహ్లి బృందాన్ని చిత్తు చేసింది. గురువారం ఇక్కడి ఓవల్‌ మైదానంలో జరిగిన గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (128 బంతుల్లో 125; 15 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో చెలరేగగా... రోహిత్‌ శర్మ (79 బంతుల్లో 78; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎమ్మెస్‌ ధోని (52 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడారు.

అనంతరం శ్రీలంక 48.4 ఓవర్లలో 3 వికెట్లకు 322 పరుగులు చేసింది. చాంపియన్స్‌ ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యధిక పరుగుల ఛేదన కావడం విశేషం. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కుషాల్‌ మెండిస్‌ (93 బంతుల్లో 89; 11 ఫోర్లు, 1 సిక్స్‌), ధనుష్క గుణతిలక (72 బంతుల్లో 76; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ మ్యాథ్యూస్‌ (45 బంతుల్లో 52 నాటౌట్‌; 6 ఫోర్లు) లంక విజయంలో ప్రధాన పాత్ర పోషించగా, కుషాల్‌ పెరీరా (44 బంతుల్లో 47 రిటైర్డ్‌హర్ట్‌; 5 ఫోర్లు) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

శుభారంభం...
గత మ్యాచ్‌లాగే ఈసారి కూడా రోహిత్, ధావన్‌ జాగ్రత్తగా, చక్కటి సమన్వయంతో భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు 48 పరుగులు చేసింది. పెరీరా వేసిన 20వ ఓవర్లో రోహిత్‌ ఒక్కసారిగా దూకుడు పెంచాడు. పెరీరా బౌలింగ్‌లో సిక్స్‌తో 58 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్, అదే ఓవర్లో మరో భారీ సిక్సర్‌ కొట్టాడు. ఆ తర్వాత మలింగ బౌలింగ్‌లోనూ మరో సిక్స్‌ కొట్టిన రోహిత్, తర్వాతి బంతికే వెనుదిరగడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడగా,  కోహ్లి (0), యువరాజ్‌ (7) విఫలమయ్యారు.  

ధావన్‌ స్పెషల్‌...
ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంకపై గత నాలుగు మ్యాచ్‌లలో కలిపి 377 పరుగులు సాధించిన ధావన్, అదే జోరును కొనసాగించాడు. అద్భుతమైన టైమింగ్‌తో షాట్‌లు ఆడాడు. ఈ క్రమంలో 69 బంతుల్లో అతని హాఫ్‌ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత మరింత చెలరేగిపోయిన శిఖర్‌... మలింగ, ప్రదీప్‌ వేసిన వరుస ఓవర్లలో రెండేసి ఫోర్లు బాదాడు. అనంతరం ప్రదీప్‌ బౌలింగ్‌లో పాయింట్‌ దిశగా ఫోర్‌ కొట్టి 112 బంతుల్లో ధావన్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చివరకు మలింగ అతని ఆటను ముగించాడు.
 
ధోని దూకుడు...
ఇన్నింగ్స్‌ 34వ ఓవర్లో క్రీజ్‌లోకి వచ్చిన ధోని భారీ సిక్సర్‌తో ఖాతా తెరిచాడు. మలింగ బౌలింగ్‌లో మరో రెండు ఫోర్లు కొట్టిన ధోని, 46 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు. 40–45 ఓవర్ల మధ్య తాను ఎదుర్కొన్న 14 బంతుల వ్యవధిలో ధోని ఆరు ఫోర్లు కొట్టడం విశేషం. పెరీరా బౌలింగ్‌లో మరో సిక్స్‌ కొట్టిన మాజీ కెప్టెన్, అతని బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. పాండ్యా (9) ప్రభావం చూపలేకపోయినా, పెరీరా వేసిన ఇన్నింగ్స్‌ చివరి నాలుగు బంతుల్లో 14 పరుగులు రాబట్టి కేదార్‌ జాదవ్‌ (13 బంతుల్లో 25 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) భారీ స్కోరులో తానూ కీలక పాత్ర పోషించాడు. చివరి పది ఓవర్లలో భారత్‌ 103 పరుగులు సాధించింది.

భారీ భాగస్వామ్యం...
తొలి 7 ఓవర్లలో 22 పరుగులు... ఒకే ఒక్క బౌండరీ. ఓపెనర్‌ డిక్‌వెలా (7) అవుట్‌... శ్రీలంక పరిస్థితి ఇది. అయితే గుణతిలక, మెండిస్‌ భాగస్వామ్యం ఒక్కసారిగా ఆ జట్టు ఇన్నింగ్స్‌ను పరుగెత్తించింది. వీరిద్దరి చక్కటి బ్యాటింగ్, సమన్వయానికి తోడు భారత బౌలర్లు పట్టు తప్పడం కూడా లంకకు కలిసొచ్చింది. ఉమేశ్‌ బౌలింగ్‌లో గుణతిలకే భారీ సిక్సర్‌తో మొదలైన ఈ జోరు మరో ఇరవై ఓవర్లకు పైగా సాగింది.  24 పరుగుల వద్ద మెండిస్‌ ఇచ్చిన కష్టసాధ్యమైన రిటర్న్‌ క్యాచ్‌ను అందుకోవడంలో పాండ్యా విఫలమయ్యాడు. ఈ క్రమంలో 47 బంతుల్లోనే గుణతిలక హాఫ్‌ సెంచరీ పూర్తయింది. జడేజా వేసిన ఓవర్లో వీరిద్దరు చెలరేగి 2 ఫోర్లు, సిక్స్‌తో 16 పరుగులు రాబట్టారు. 65 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న మెండిస్, పాండ్యా బౌలింగ్‌లో వరుసగా మూడు బౌండరీలతో మరింత దూకుడు ప్రదర్శించాడు. వీరిద్దరి ధాటిని అడ్డుకునేందుకు చివరకు కేదార్‌కు బౌలింగ్‌ ఇచ్చిన కోహ్లి, తర్వాతి ఓవర్లో తనే స్వయంగా బౌలింగ్‌కు దిగాడు. ఈ ఓవర్లో భారత్‌కు అదృష్టం కలిసొచ్చింది.

లేని రెండో పరుగు కోసం ప్రయత్నించి గుణతిలక రనౌట్‌ కావడంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది. కొద్ది సేపటికి భువీ త్రోకు మెండిస్‌ కూడా రనౌట్‌గా వెనుదిరగడంతో భారత్‌కు మళ్లీ పట్టు చిక్కింది. అయితే మ్యాథ్యూస్, కుషాల్‌ పెరీరా ఆ అవకాశం ఇవ్వలేదు. ఏ మాత్రం తడబడకుండా దూకుడు ప్రదర్శించిన వీరిద్దరు వేగంగా జట్టును విజయం వైపు తీసుకెళ్లారు. 10.2 ఓవర్లలోనే 75 పరుగులు జోడించిన అనంతరం పెరీరా కండరాల నొప్పితో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే గుణరత్నే (21 బంతుల్లో 34 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకారంతో మ్యాథ్యూస్‌ శ్రీలంకకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

ఇక క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లే!
గ్రూప్‌ ‘బి’లో పరిస్థితి చాలా స్పష్టం. గెలిచిన జట్టు సెమీస్‌కు, ఓడితే ఇంటికి. భారత్‌పై శ్రీలంక విజయంతో ఎలాంటి లెక్కల అవసరం లేకుండా రెండు క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లకు వేదిక సిద్ధమైంది. ప్రస్తుతం భారత్, పాక్, లంక, దక్షిణాఫ్రికా ఒక్కో విజయంతో రెండేసి పాయింట్లతో సమంగా నిలిచాయి. తర్వాతి మ్యాచ్‌లో గెలిచే జట్లకు అది రెండో విజయం అవుతుంది కాబట్టి సెమీస్‌లో చోటు ఖాయం. ఆదివారం భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుండగా, సోమవారం పాక్, శ్రీలంక మ్యాచ్‌ జరుగుతుంది. అయితే వర్షంతో మ్యాచ్‌లు రద్దయ్యే పరిస్థితి వస్తే మాత్రం క్యాలిక్యులేటర్‌ చేత పట్టక తప్పదు!


చాంపియన్స్‌ ట్రోఫీలో నేడు
న్యూజిలాండ్‌& బంగ్లాదేశ్‌
వేదిక: కార్డిఫ్, గ్రూప్‌: ‘ఎ’
మ.గం. 2.50 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement