
సెలక్టర్లపై షమీ విమర్శలు
కోల్‌కతా: పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీలో వన్డేలు ఆడాడు. ఈ టోర్నీలో వరుణ్ చక్రవర్తితో సమంగా అత్యధిక వికెట్లు (9) తీసిన భారత బౌలర్‌గా జట్టు విజయంలో అతనూ కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్‌కు మాత్రం అతనికి జట్టులో చోటు దక్కలేదు. పైగా షమీ ఫిట్‌నెస్‌పై తమకు ఎలాంటి సమాచారం లేదని కూడా సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించాడు.
దీనిపై ఇప్పుడు షమీ తీవ్రంగా స్పందించాడు. నేటి నుంచి ఉత్తరాఖండ్‌తో జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బెంగాల్ తరఫున షమీ బరిలోకి దిగుతున్నాడు. ‘జట్టులో ఎంపిక నా చేతుల్లోనే లేదనేది వాస్తవం. అయితే నేను ఫిట్‌గా లేకపోతే ఇప్పుడు రంజీ ట్రోఫీలో ఆడకపోయేవాడిని. దీనిపై మాట్లాడి వివాదాస్పదం చేయదల్చుకోలేదు. కానీ నాలుగు రోజులు మ్యాచ్‌లు ఆడగలిగినప్పుడు వన్డే కూడా ఆడగలిగేవాడిని.
నా ఫిట్‌నెస్ గురించి సమాచారం ఇవ్వడం లేదా అడగడం అనేది నా పని కాదు. జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి సన్నద్ధం కావడమే నా పని. ఫిట్‌నెస్ గురించి తమకు ఎవరు సమాచారం ఇవ్వాలి, ఎవరు ఇవ్వలేదు అనేది తెలుసుకోవడం సెలక్టర్ల పనే తప్ప నాది కాదు’ అని షమీ వ్యాఖ్యానించాడు. శస్త్రచికిత్స తర్వాత బోర్డు నిబంధనల ప్రకారం తాను పూర్తి ప్రక్రియను అనుసరించినట్లు గుర్తు చేసిన షమీ... రంజీ ట్రోఫీలో సత్తా చాటేందుకు సిద్ధమని వెల్లడించాడు.