సర్వీసెస్‌పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరిన బెంగాల్
కోల్‌కతా: రంజీ ట్రోఫీలో బెంగాల్ జట్టు నాకౌట్ దశకు దూసుకెళ్లింది. గ్రూప్ ‘సి’లో భాగంగా బెంగాల్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో సర్వీసెస్‌ను మట్టికరిపించి బోనస్ పాయింట్ ఖాతాలో వేసుకుంది. బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 519 పరుగులు చేయగా... సర్వీసెస్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆకట్టుకోలేకపోయింది.
తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులకే ఆలౌటైన సర్వీసెస్...‘ఫాలోఆన్’ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలో 287 పరుగులకు పరిమితమైంది. ఓవర్‌నైట్ స్కోరు 231/8తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సర్వీసెస్ కాస్త ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. జయంత్ (68 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో పారాడాడు.
బెంగాల్ బౌలర్లలో టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ 51 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ‘డబుల్ సెంచరీ’ సాధించిన సుదీప్ చటర్జీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. గ్రూప్ దశలో 6 మ్యాచ్‌లాడిన బెంగాల్ 4 విజయాలు, 2 ‘డ్రా’లతో 30 పాయింట్లు ఖాతాలో వేసుకొని క్వార్టర్ ఫైనల్‌కు చేరింది.


