బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంపై అభ్యంతరం
శిఖర్ ధావన్, సురేష్ రైనాలపై సీపీ సజ్జనర్ ఫైర్
తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా విరుచుకుపడ్డ కొత్వాల్
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు కమిషనర్ సజ్జనర్ శుక్రవారం ప్రముఖ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనాలపై విరుచుకుపడ్డారు. సజ్జనర్ సోషల్‌మీడియా కేంద్రంగా ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ పేరుతో ఓ ఉద్యమాన్నే నడుపుతున్నారు. ప్రధానంగా యువత ఈ యాప్స్ బారినపడకుండా అవగాహన కల్పిస్తున్నారు.
మరోపక్క బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసి, భారీగా లాభాలు ఆర్జించిన ప్రముఖల వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తోంది. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో శిఖర్ ధావన్, సురేష్ రైనాలకు చెందిన రూ.11 కోట్ల విలువైన ఆస్తుల్ని గురువారం సీజ్ చేసింది. దీనికి సంబంధించి ఓ ఆంగ్ల దినపత్రిలో ప్రచురితమైన కథనాన్ని తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసిన సజ్జనర్... ‘వీళ్లేం సెలబ్రిటీలు? అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? బెట్టింగ్ మహమ్మారి బారినపడి ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు.
వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సమాజాన్ని ఛిద్రం చేస్తోన్న బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నింటికీ బాధ్యులు కారా? సమాజం మేలు కోసం, యువత ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి నాలుగు మంచి మాటలు చెప్పండి..అంతేకానీ మిమ్ముల్ని అభిమానించే వాళ్లను తప్పుదోవపట్టించి వారి ప్రాణాలను తీయకండి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ పోస్టును ఐదు గంటల్లో 21,800 మంది చూడగా..368 మంది లైక్ చేశారు. సజ్జనర్ వ్యాఖ్యలకు మద్దతుగా పెద్దఎత్తున నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.


