
కొలంబో: ఆఖరి టెస్టులోనూ ఆతిథ్య శ్రీలంకపై ఇంగ్లండ్ జయభేరి మోగించి మూడు టెస్టుల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. సోమవారం చివరి టెస్టులో ఇంగ్లండ్ 42 పరుగుల తేడాతో లంకపై గెలిచింది. 327 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు నాలుగో రోజు 53/4 స్కోరుతో ఆట కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 86.4 ఓవర్లలో 284 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇంగ్లండ్ స్పిన్నర్లు జాక్ లీచ్ (4/72), మొయిన్ అలీ (4/92)లు లంక బ్యాట్స్‌మెన్‌ను చుట్టేశారు.
కుశాల్ మెండిస్ (86; 8 ఫోర్లు, 1 సిక్స్), రోషన్ సిల్వా (65; 4 ఫోర్లు), పుష్పకుమార (40 బంతుల్లో 42 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. 55 ఏళ్ల తర్వాత విదేశాల్లో 3 అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఘనతను జో రూట్ సేన సొంతం చేసుకుంది. గతంలో 1963లో డెక్స్‌టర్ సారథ్యంలో ఇంగ్లండ్ 3–0తో న్యూజిలాండ్‌ను వైట్‌వాష్ చేసింది.