
లంక గడ్డపై తొలిసారిగా..
శ్రీలంక గడ్డపై దక్షిణాఫ్రికా జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారిగా ఇక్కడ వన్డే సిరీస్‌లో జయకేతనం ఎగురవేసింది. ఇరు జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను సఫారీలు 2-1తో గెలుచుకున్నారు.
వన్డే సిరీస్ నెగ్గిన దక్షిణాఫ్రికా
మూడో వన్డేలో ఘనవిజయం
హంబన్‌టోటా: శ్రీలంక గడ్డపై దక్షిణాఫ్రికా జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారిగా ఇక్కడ వన్డే సిరీస్‌లో జయకేతనం ఎగురవేసింది. ఇరు జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను సఫారీలు 2-1తో గెలుచుకున్నారు. రెండో వన్డేలో లంక నెగ్గింది. మహింద రాజపక్స మైదానంలో శనివారం జరిగిన చివరి వన్డేలో డివిలియర్స్ సేన 82 పరుగుల తేడాతో శ్రీలంకను మట్టికరిపించింది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 339 పరుగుల స్కోరు చేసింది. ఓపెనర్ డి కాక్ (127 బంతుల్లో 128; 12 ఫోర్లు; 3 సిక్సర్లు), డివిలియర్స్ (71 బంతుల్లో 108; 11 ఫోర్లు; 4 సిక్సర్లు) శతకాలతో అదరగొట్టారు. సిరీస్‌లో ఇప్పటికే రెండు సెంచరీలతో రెచ్చిపోయిన ఆమ్లా (61 బంతుల్లో 48; 4 ఫోర్లు) మరోసారి ఆకట్టుకున్నాడు. మెండిస్, హెరాత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక 44.3 ఓవర్లలో 257 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ మాథ్యూస్ (81 బంతుల్లో 58; 5 ఫోర్లు; 1 సిక్స్), ఓపెనర్ పెరీరా (25 బంతుల్లో 37; 4 ఫోర్లు; 2 సిక్సర్లు), సంగక్కర (23 బంతుల్లో 36; 6 ఫోర్లు) మాత్రమే రాణించారు. మెక్‌లారెన్‌కు మూడు, డుమిని, మోర్కెల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డివిలియర్స్, సిరీస్ హషీమ్ ఆమ్లాలకు దక్కాయి.