
మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి (ఫైల్ ఫోటో)
సాక్షి, స్సోర్ట్స్ : టెస్టు క్రికెట్‌లో అత్యంత కీలకమైనది మూడో స్థానంలో బ్యాటింగ్. ఓపెనర్లు విఫలమయితే కొత్త బంతిని పాతపడేవరకు ఆడి, తరువాత వచ్చే వారికి బ్యాటింగ్ సులభతరం చేయాలి. అలాంటి స్థానంలో వచ్చి అసాధారణ బ్యాటింగ్‌తో భారత క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన చతేశ్వర పుజారాను గుర్తించక పోవటం బాధాకరం అని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి అభిప్రాయపడ్డారు. బుధవారం కోల్‌కతాలో జరిగిన ఒక సమావేశంలో ఆయన పుజారాపై ప్రశంసలుజల్లు కురిపించాడు.
ఇప్పటివరకు టెస్టులో 14 సెంచరీలు చేసిన పుజారా.. కోహ్లి తరహాలో చాలా ముఖ్యమైన ఆటగాడని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఇక ఐపీఎల్‌లో పుజారాను ఎవరు తీసుకోకపోవటంతో అతను రాబోయే సిరీస్‌లను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందించుకుంటే బాగుంటుందని సూచించాడు.
ఇక ఐపీఎల్‌లో ఏ ఫ్రాంచైజీ ఈ టెస్ట్ బ్యాట్స్‌మన్‌ను తీసుకోకపోవడంతో మళ్లీ ఇంగ్లిష్ కౌంటీ జట్లలో ఒకటైన యార్క్‌షైర్ జట్టు తరుపున పుజారా ఆడనున్నాడు. ఆగస్టులో భారత్ ఇంగ్లండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో కౌంటీలు మేలు చేస్తాయని పూజారా భావిస్తున్నాడు.