యాషెస్‌ హీరో స్టీవ్‌ స్మిత్‌

Smith 8 Successive 50 Plus Scores In Ashes - Sakshi

మాంచెస్టర్‌:  ఇటీవల బ్యాట్స్‌మెన్‌ టెస్టు ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానం దక్కించుకున్న ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌.. మరో మైలురాయిని చేరాడు. యాషెస్‌ సిరీస్‌లో వరుసగా యాభైకి పైగా పరుగుల్ని అత్యధికంగా సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సాధించాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో రెండు వరుస సెంచరీలు సాధించిన స్మిత్‌.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు సాధించాడు. గాయం కారణంగా రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌కు, మూడో టెస్టుకు స్మిత్‌ దూరమయ్యాడు. అయితే నాల్గో టెస్టు ద్వారా మళ్లీ  రీ ఎంట్రీ ఇచ్చిన స్మిత్‌ మరొక అజేయ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ 60 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఓవరాల్‌ యాషెస్‌లో వరుసగా ఎనిమిదిసార్లు యాభైకి పైగా పరుగులు సాధించిన ఏకైక హీరోగా స్మిత్‌ కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. యాషెస్‌లో స్మిత్‌ వరుసగా సాధించిన పరుగులు.. 239, 76, 102 నాటౌట్‌, 83, 144, 142, 92, 60.  ఫలితంగా యాషెస్‌ హీరోగా అనిపించుకుంటున్నాడు స్మిత్‌.

బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో ఏడాదిపాటు నిషేధానికి గురైన స్మిత్‌ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ ద్వారా టెస్టుల్లో మళ్లీ అడుగుపెట్టిన స్మిత్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇంగ్లండ్‌ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి తన బ్యాటింగ్‌ పవర్‌ ఏమిటో చూపిస్తున్నాడు. ఈ యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టును ఆసీస్‌ గెలిచిందంటే అందుకు స్మిత్‌ సాధించిన రెండు భారీ సెంచరీలు కారణం. ఇక రెండో టెస్టు డ్రాగా ముగియగా, స్మిత్‌ ఆడని మూడో టెస్టును ఇంగ్లండ్‌ గెలిచింది. ఇప్పుడు నాల్గో టెస్టులో స్మిత్‌ సమయోచితంగా బ్యాటింగ్‌ చేస్తూ ఇంగ్లిష్‌ బౌలర్లకు పరీక్షగా నిలుస్తున్నాడు. మూడో వికెట్‌కు లబుషేన్‌తో కలిసి 116 పరుగుల భాగస్వామ్యాన్ని స్మిత్‌ నెలకొల‍్పడంతో ఆసీస్‌ గాడిలో పడింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top