‘నువ్వెంత ఇచ్చావ్‌’ అనడం దారుణం

Should Not Question Amount One Has Donated,Ojha - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విజృంభించి ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న తరుణంలో ప్రతీ ఒక్కరూ తమ వంతు సాయం చేసి ప్రభుత్వాలకు అండగా ఉంటున్నారు. ఇది ప్రపంచ సమస్య  కాబట్టి ఏ దేశంలోని ప్రముఖులు వారికి దేశాలకే సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇందులో  తప్పులేదు.. కానీ మనం చేసే సాయాల్ని వేలెత్తి చూపడాన్ని భారత  మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా తీవ్రంగా తప్పుబట్టాడు. ఈ కష్ట సమయంలో ఎవరికి తోచింది వారు సాయం చేస్తారని, అది వారి అప్పటి ఆర్థిక  పరిస్థితిని బట్టి ఆధారపడుతుందని ఓజా స్పష్టం చేశాడు.

కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ రూ. 25 కోట్లు సాయం చేస్తే, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రూ. 50 లక్షలు విరాళంగా ఇచ్చాడు. దీనిపైనే సోషల్‌ మీడియాలో ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఒక ఫిల్మ్‌ స్టార్‌ 25 కోట్ల విరాళంగా ఇవ్వడానికి ముందుకొస్తే, దిగ్గజ క్రీడాకారుడు సచిన్‌ రూ. 50 లక్షలు  ఇవ్వడం ఏమటనేది చర్చనీయాంశంగా మారింది.  మరొకవైపు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కూడా రూ. 50 లక్షలు విరాళంగా ఇచ్చాడు. ఇక బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు రూ. 10 లక్షలు సాయం చేసింది. (గుండె పగిలిపోతోంది.. విరుష్కల విరాళం)

ఇలా ప్రతీ ఒక్కరు చేసిన సాయాల్ని జనం నిశితంగా చూడటమే కాకుండా విమర్శలకు కూడా దిగడంతో ఓజా కోపం వచ్చింది. అసలు సాయానికి కొలమానం ఉంటుందా అని ప్రశ్నించాడు. ఎవరు ఎంత సాయం చేసినా వారికి ధన్యవాదాలు చెప్పాలని, అంతేకానీ ‘నువ్వు తక్కువ సాయం చేశావ్‌.. వాడు ఎక్కువ సాయం చేశాడు’ అనడంలాంటి వ్యాఖ్యలు మంచిది కాదన్నాడు. ‘ ఇది చాలా కొత్తగా అనిపిస్తోంది. ప్రతీ ఒక్కరికీ సాయం చేసే గుణం ఉండాలి. అంతే కానీ ఇంత ఇచ్చావ్‌ అని ప్రశ్నించడం కరెక్ట్‌ కాదు. సహాయం అనేది సహాయమే. దీనికి వేరే కొలమానాలు లేవు. ఎవరు సాయం చేసినా అందుకు ధన్యవాదాలు  తెలిపాలి’ అని ఓజా విన్నవించాడు. (ధోని టార్గెట్‌ రూ. 30 లక్షలే..)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top