ధోని టార్గెట్‌ రూ. 30 లక్షలే.. | Sakshi
Sakshi News home page

ధోని టార్గెట్‌ రూ. 30 లక్షలే..

Published Mon, Mar 30 2020 4:00 PM

MS Dhoni Wanted To Make Rs 30 Lakh For Live Peacefully, Jaffer - Sakshi

రాంచీ:  భారత క్రికెట్‌ను అత్యున్నత స్థాయిలో నిలిపిన కెప్టెన్ల జాబితాలో ఎంఎస్‌ ధోని కచ్చితంగా ముందు వరుసలో ఉంటాడు. అటు టీ20 వరల్డ్‌కప్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్‌, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలను భారత్‌కు అందించిన ఏకైక కెప్టెన్‌ ధోని. మరి రైల్వే టికెట్‌ కలెక్టర్‌గా కెరీర్‌ను ఆరంభించిన దగ్గర్నుంచీ,  భారత్‌ జట్టులో చోటు సంపాదించే వరకూ ధోని పడిన కష్టాలు ఒక ఎత్తైతే, జట్టులో చోటు నిలబెట్టుకోవడం కోసం పడిన కష్టాల్లో మరొక ఎత్తు.  మధ్య తరగతి కుటుంబంలో పుట్టడమే కాకుండా  భారత్‌లో మతంగా భావించే క్రికెట్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవడం అంత ఈజీ కాదు.  

మరి క్రికెట్‌నే శ్వాసగా భావించిన ధోని తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడమే కాదు.. కోట్ల మంది భారతీయుల లక్ష్యాన్ని కూడా సాధించి పెట్టాడు. అసలు క్రికెట్‌లోకి రాకముందు ధోని లక్ష్యం ఏమిటి. ఎంత సంపాదించి హ్యాపీ జీవితాన్ని గడపాలనుకున్నాడు అనే విషయాల్ని టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ వెల్లడించాడు. చిన్న  చిన్న  నగరాల నుంచి వచ్చిన  మధ్య తరగతి కుటుంబాల క్రికెటర్లకు ఏయే కోరికలు ఉంటాయో అవే ధోనిలో ఉండేవని జాఫర్‌ పేర్కొన్నాడు. క్రికెట్‌ ద్వారా ధోని సంపాదించాలనుకున్నది చాలా తక్కువ  అని ఈ సందర్భంగా జాఫర్‌ తెలిపాడు.(మా బ్యాట్స్‌మన్‌ తర్వాతే సెహ్వాగ్‌..)

‘ క్రికెట్‌ ఆడుతూ ధోని రూ. 30 లక్షల సంపాదన మాత్రమే తన టార్గెట్‌గా నిర్దేశించుకున్నాడు. తన స్వస్థలం రాంచీలో హ్యాపీగా బ్రతకడానికి ఆ మొత్తం చాలని ధోని లక్ష్యంగా పెట్టుకున్నాడు’ అని జాఫర్‌ తెలిపాడు. ‘ధోనితో మీకున్న మంచి జ్ఞాపకం ఏదైనా ఉందా’ అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు జాఫర్‌ ఇలా సమాధానమిచ్చాడు. ధోనితో తనకున్న సాన్నిహిత్యంలో అతను బ్రతకడానికి పెట్టుకున్న లక్ష్యమే తనకు ఒక మంచి జ్ఞాపకం అని  జాఫర్‌ పేర్కొన్నాడు. భారత్‌ క్రికెట్‌లో ధోని అడుగుపెట్టిన ఒకటి-రెండేళ్ల కాలంలో ఈ విషయమే తనకు ఎక్కువ గుర్తుందన్నాడు. రూ. 30  లక్షల రూపాయిలు  ఉంటే సంతోషకరమైన జీవితం గడపడానికి చాలని ధోని పదే పదే  అనేవాడన్నాడు. ఇటీవల అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన జాఫర్‌.. ధోని మళ్లీ అంతర్జాతీయ రీఎంట్రీ ఇస్తాడన్నాడు. ధోని నిరూపించుకోవడానికి ఐపీఎల్‌ వంటి లీగ్‌లు అవసరం  లేదన్నాడు. ధోని ఎంట్రీ అనేది నేరుగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. (స్టీవ్‌ స్మిత్‌పై ‘నిషేధం’ ముగిసింది)

Advertisement

తప్పక చదవండి

Advertisement