మా బ్యాట్స్‌మన్‌ తర్వాతే సెహ్వాగ్‌..

Afridi Redefined Opening in Test Cricket,Says Akram - Sakshi

కరాచీ:  టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని దూకుడుతో ఓపెనింగ్‌ స్థానానికే వన్నె తెచ్చిన ఆటగాడు. సాంప్రదాయ టెస్టు క్రికెట్‌లో కూడా తనదైన ముద్ర వేశాడు సెహ్వాగ్‌. టెస్టు క్రికెట్‌లో కూడా పరిమిత ఓవర్ల క్రికెట్‌ మజాను అందించిన క్రికెటర్‌ సెహ్వాగ్‌. టెస్టుల్లో ఎన్నో సందర్భాల్లో  హాఫ్‌ సెంచరీ, సెంచరీలను సిక్స్‌లతో ముగించిన సెహ్వాగ్‌. ఓవరాల్‌గా చూస్తే ఈ ఫార్మాట్‌ ఓపెనింగ్‌ మైండ్‌సెట్‌ను మార్చేశాడనేది చాలామంది అభిప్రాయం. అయితే టెస్టుల్లో ఓపెనింగ్‌ మైండ్‌సెట్‌ను మార్చింది సెహ్వాగ్‌ ఎంతమాత్రం కాదని అంటున్నాడు పాకిస్తాన్‌ దిగ్గజ బౌలర్‌ వసీం అక్రమ్‌. వీరేంద్ర సెహ్వాగ్‌ కంటే ముందే టెస్టు ఓపెనింగ్‌కు వన్నె తెచ్చిన క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది అని అక్రమ్‌ తెలిపాడు. 

‘సెహ్వాగ్‌ క్రికెట్‌లో అరంగేట్రం​ చేయకముందే అఫ్రిది టెస్టు ఫార్మాట్‌లో ఓపెనింగ్‌ మైండ్‌ సెట్‌ను మొత్తం మార్చేశాడు. 1998లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టెస్టు ఫార్మాట్‌లో ఓపెనర్‌గా అరంగేట్రం చేశాడు. ఆపై 1999-2000  సీజన్‌లో భారత పర్యటనకు ఆఫ్రిది వచ్చాడు. అదే ఆఫ్రిది కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌. ఒక విధ్వంసకర ఆటగాడిగా ఆఫ్రిది గుర్తింపు సాధించింది ఆనాటి భారత పర్యటనలోనే. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో ఆఫ్రిది మొదటి సెంచరీ సాధించడమేకాకుండా మ్యాచ్‌లో  విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఆ సిరీస్‌ను పాకిస్తాన్‌ 2-1తో గెలుచుకుంది. ఈ పర్యటనకు జట్టును ఎంపిక చేసే ముందు ఆఫ్రిదిని ఎంపిక చేయాలని ఇమ్రాన్‌ఖాన్‌కు చెప్పా.  

అయితే చాలా మంది సెలక్టర్లు ఆఫ్రిది తీసుకోవడం వ్యతిరేకించారు. కానీ ఇమ్రాన్‌ఖాన్‌ నుంచి కెప్టెన్‌ అయిన నాకు మద్దతు లభించింది. ఆఫ్రిది కనీసం ఒకటి లేదా రెండు టెస్టు మ్యాచ్‌లు గెలిపిస్తాడని నమ్మకాన్ని ఇమ్రాన్‌ కల్పించాడు. అదే జరిగింది. ఓపెనింగ్‌కు వన్నె తెచ్చిన క్రికెటర్‌ ఆఫ్రిది. సెహ్వాగ్‌ కంటే ముందు దూకుడైన ఆటతో  క్రికెట్‌ అభిమానులను అలరించాడు ఆఫ్రిది.  నేను సాధారణంగా చాలా విషయాలను ఇమ్రాన్‌తో  చర్చిస్తాను. ఒక పర్యటనకు ముందు మా లెజెండ్‌ కెప్టెన్‌ అయిన ఇమ్రాన్‌తో చర్చించడం నాకు అలవాటు. అతని సలహాలు ఎప్పుడూ నాకు బాగా ఉపయోగపడేవి. చెన్నై ట్రాక్‌లో అనిల్‌ కుంబ్లే, సునీల్‌ జోషిల బౌలింగ్‌లో సిక్స్‌లు మోత మోగించాడు ఆఫ్రిది. స్పిన్నర్లు ప్రధాన బలమైన భారత్‌పై ఆఫ్రిది విరుచుకుపడ్డాడు. ఆనాటి మ్యాచ్‌లో ఆఫ్రిది 141 పరుగులు సాధించాడు. ఓపెనర్‌గా ఆఫ్రిది మార్కు సెపరేటు. నా పరంగా చూస్తే టెస్టుల్లో  ఓపెనింగ్‌ మైండ్‌సెట్‌ను మార్చింది మాత్రం ఆఫ్రిదినే’ అని అక్రమ్‌ తెలిపాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top