స్టీవ్‌ స్మిత్‌పై ‘నిషేధం’ ముగిసింది

Smith Free To Captain Australia Again After Leadership Ban Ends - Sakshi

సిడ్నీ: రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికాతో  కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో  బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొని ఏడాది పాటు నిషేధానికి గురైన ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌.. గతేడాది యాషెస్‌ సిరీస్‌ ద్వారా టెస్టులో రీఎంట్రీ ఇచ్చాడు.  ఆ సిరీస్‌లో విశేషంగా రాణించి తన విలువ ఏమిటో చూపించాడు స్మిత్‌. కాగా, స్మిత్‌ నిషేధం ఎదుర్కొనే సమయంలోనే క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) పెద్దలు అతనిపై మరో ఆంక్ష కూడా విధించారు. ఆసీస్‌ జట్టులో పునరాగమనం చేసినప్పటికీ రెండేళ్ల పాటు స్మిత్‌ను కెప్టెన్సీకి దూరంగా ఉంచాలని నిర్ణయించారు.   అయితే  ఆ నిషేధాన్ని కూడా స్మిత్‌  పూర్తి చేసుకున్నాడు.  2020, మార్చి 29వ(ఆదివారం) తేదీతో స్మిత్‌పై ఉన్న రెండేళ్ల పాటు కెప్టెన్సీకి దూరంగా ఉండాలన్న నిషేధం ముగిసింది. (ఐపీఎల్‌కు ఆసీస్‌ ఆటగాళ్లు గుడ్‌ బై!)

ఇక స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించడమే సీఏ ముందున్న విధి. మరి స్మిత్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తారో.. మరి కొంతకాలం వేచి చూస్తారా అనేది సీఏ యాజమాన్యం ఆలోచనపైనే ఆధారపడి వుంటుంది.  ప్రస్తుతం ఆసీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా అరోన్‌ ఫించ్‌ ఉండగా, టెస్టు కెప్టెన్‌గా టిమ్‌ పైన్‌ కొనసాగుతున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఫించ్‌ను తప్పించాలనే ఆలోచనలో సీఏ లేదు. అలాడే పైన్‌ కూడా టెస్టుల్లో కొనసాగించాలనే చూస్తోంది. వీరిద్దరి కెప్టెన్సీపై కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ఇటీవల ప్రశంసలు కురిపించాడు. ప్రత్యేకంగా టిమ్‌ పైన్‌ నాయకత్వ లక్షణాలు అమోఘం అంటూ కొనియాడాడు. అదే సమయంలో స్మిత్‌కు అదనపు భారాన్ని ఇవ్వడం కూడా ఆసీస్‌ క్రికెట్‌ పెద్దలకు ఇష్టం లేదు. కెప్టెన్‌గా స్మిత్‌ సమర్థుడైనప్పటికీ ఆ బాధ్యతలు అప్పచెప్పి బ్యాటింగ్‌ ఒత్తిడి తీసుకురాకూడదనేది సీఏ యోచన. రాబోవు సిరీస్‌ల్లో పైన్‌, ఫించ్‌లు కెప్టెన్‌లుగా విఫలమైతే మాత్రం మళ్లీ స్మిత్‌నే సారథిగా చేసే అవకాశం ఉంది. ('స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్‌గా సరైనోడు కాదు')

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top