ఐపీఎల్‌కు ఆసీస్‌ ఆటగాళ్లు గుడ్‌ బై!

Cricket Australia Likely To Review IPL contracts In Wake Of COVID-19 - Sakshi

మెల్‌బోర్న్‌ : కరోనా వైరస్ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్‌-13వ సీజన్‌కు రాకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా వివిధ ఐపీఎల్‌ ప్రాంచైజీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిసింది. కాగా ఈ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రమేయం ఏమీ లేదని చెబుతున్నారు. 'ఐపీఎల్‌లో ఆడాలా? వద్దా? అనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం.  ఆటగాళ్లు ఐపీఎల్‌తో వ్యక్తిగతంగా ఒప్పందం కుదుర్చుకున్నారన్న విషయం తమకు తెలుసు. కానీ ఈ విషయంలో తాము సలహా మాత్రమే ఇవ్వగలం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్లు సరైన నిర్ణయమే తీసుకుంటారననే మేము భావిస్తున్నాం' అని  సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ తెలిపాడు. మరోవైపు ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలా? లేక యూకేలో జరగనున్న హండ్రడ్ సిరీస్‌కు అనుమతి ఇవ్వాలా? అనే దానిపై క్రికెట్ ఆస్ట్రేలియా సమీక్ష నిర్వహించనుంది. (అలెక్స్‌ హేల్స్‌కు కరోనా సోకిందా?)

కాగా ఆస్ట్రేలియాకు చెందిన మొత్తం 17 మంది ఆటగాళ్లు ఐపీఎల్‌లో వివిధ ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరిలో పేసర్ పాట్ కమిన్స్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తదితరులు ఐపీఎల్‌తో ఒప్పందాన్ని వదులకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐపీఎల్ వేలంలో 3.2 మిలియన్ డాలర్లు (రూ.15.2 కోట్లు) పలికిన కమిన్స్ అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మ్యాక్స్‌వెల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 13వ సీజన్‌ను ఏప్రిల్‌15 వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రసుత్తం కరోనా వైరస్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 15 నుంచి ఐపీఎల్‌ జరగుతుందా అనేది అనుమానంగానే ఉంది.ఒకవేళ ఆసీస్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటే అది మిగతా దేశాల క్రికెటర్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. దాంతో కరోనా వైరస్‌ ప్రభావం తగ్గితే మినీ ఐపీఎల్‌ నిర్వహించాలనే యోచనలో ఉన్న బీసీసీఐ ఆశలు నెరవేరకపోవచ్చు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top