'స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్‌గా సరైనోడు కాదు'

Michael Clarke Sensational Comments On Steve Smith About Captaincy - Sakshi

మెల్‌బోర్న్‌ : ఆసీస్ సారథిగా స్టీవ్ స్మిత్‌ సరైన వ్యక్తి కాదంటూ ఆ జట్టు మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ పేసర్ పాట్ కమిన్స్‌ను మూడు ఫార్మాట్లలో ఆసీస్ కెప్టెన్‌గా నియమిస్తే మంచిదని క్లార్క్‌ అభిప్రాయపడ్డాడు. ఇటీవల మీడియా సమావేశంలో మైకేల్‌ క్లార్క్‌ పాల్గొనగా.. ఆసీస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌ను మళ్లీ నియమించాలంటారా? అని ఒక విలేకరి ప్రశ్నించాడు. 'ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతమంది కెప్టెన్లు అవసరం లేదు. ఒక్కో ఫార్మాట్‌కు ఒక కెప్టెన్‌ ఉండడం కన్నా.. మూడు ఫార్మాట్లకూ కలిపి ఒకే కెప్టెన్ ఉండటం మంచిది' అని పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్ తర్వాత కమిన్స్‌ను మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా నియమిస్తే మంచిదని అభిప్రాయపడ్డాడు. (భార్యకు విడాకులు.. భరణంగా రూ.285 కోట్లు!)

'పాట్‌ కమిన్స్‌ ఆటను బాగా అర్ధం చేసుకుంటాడు. అతను ఓపెనింగ్ బౌలర్ మాత్రమే గాక బ్యాటింగ్ కూడా చేయగలడు. మైదానంలోనూ కమిన్స్‌ చాలా చురుకుగా ఉంటాడు. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా నియమిస్తే మంచిదని నా అభిప్రాయం. ఇప్పటి పరిస్థితుల్లో ఆసీస్ జట్టుకు ఉత్తమ కెప్టెన్ అవసరం. స్టీవ్ స్మిత్ ఉత్తమ బ్యాట్స్‌మన్‌.. అది నేనూ ఒప్పుకుంటా.. కానీ కెప్టెన్సీ చేయడానికి సరైన వ్యక్తి మాత్రం కాదనుకుంటున్నా. ఇక టిమ్ పైన్ ఇప్పటికే కెప్టెన్‌గా అద్భుతంగా రాణించాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పైన్ వీడ్కోలు చెప్పేవరకు ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా కొనసాగే హక్కు అతనికి ఉంది. టిమ్ ఇప్పుడు 35 ఏళ్లు ఉన్నాడు. ఈ వేసవి తర్వాత అతను వీడ్కోలు గురించి ఆలోచిస్తాడని అనుకుంటున్నా. హోమ్ సిరీస్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా గెలిస్తే టిమ్ పైన్‌ వీడ్కోలు పలకడానికి అదే అనువైన సమయం అంటూ' మైకేల్‌ క్లార్క్‌ చెప్పుకొచ్చాడు. (మైకేల్‌ క్లార్క్‌ భావోద్వేగ సందేశం)

కాగా బాల్ టాంపరింగ్ కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఏడాది నిషేధం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నిషేధం కారణంగా స్మిత్ తన కెప్టెన్సీని కోల్పోయాడు. దీంతో పరిమిత ఓవర్లకు ఆరోన్ ఫించ్, టెస్ట్ ఫార్మాట్‌కు టిమ్ పైన్ కెప్టెన్‌లుగా ఉన్నారు. స్మిత్ పునరాగమనం చేసి ఏడాది కావొస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆసీస్ మాజీలు మళ్లీ స్మిత్‌కు పగ్గాలు ఇవ్వాలంటున్న తరుణంలో క్లార్క్‌ మాత్రం స్మిత్‌ కెప్టెన్‌గా సరైన వ్యక్తి కాదంటూ తేల్చి చెప్పాడు.(జర్నలిస్టుపై కోహ్లి ఆగ్రహం)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top