భారత్‌కు ఎదురుందా!

Second Test against West Indies from today - Sakshi

2–0పై గురి పెట్టిన టీమిండియా 

నేటి నుంచి విండీస్‌తో రెండో టెస్టు

విహారి,  సిరాజ్‌లకు నో చాన్స్‌   

తమ టెస్టు చరిత్రలోనే అతి పెద్ద విజయం సాధించిన తర్వాత భారత జట్టు తదుపరి లక్ష్యం ఏమిటి? ఐదేళ్ల నాటి సిరీస్‌లాగే మరోసారి 2–0తో వెస్టిండీస్‌ను చిత్తు చేయడమా? లేక సొంతగడ్డపై మరికొందరు కుర్రాళ్లకు అవకాశం కల్పించి కొత్తగా ప్రయత్నించడమా? టీమిండియా మాత్రం మొదటి దానికే మొగ్గు చూపింది. గత మ్యాచ్‌లో గెలిపించిన జట్టునే ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగిస్తూ మరో భారీ విజయంపై దృష్టి పెట్టింది. అటు ఆటతో పాటు ఇటు మానసికంగా కూడా ఎంతో బలహీనంగా కనిపిస్తున్న వెస్టిండీస్‌ పోటీనివ్వగలదా... భారత గడ్డపై వరుసగా మూడు ఇన్నింగ్స్‌ పరాజయాల తర్వాత కోలుకోగలదా అనేది భాగ్యనగరంలో తేలనుంది.   

సాక్షి, హైదరాబాద్‌ : 2011లో వెస్టిండీస్‌ జట్టు భారత్‌ గడ్డపై అప్పటికే 0–2తో సిరీస్‌ కోల్పోయినా, చివరి టెస్టును ‘డ్రా’గా ముగించగలిగింది. 2013లో ఆడిన రెండు టెస్టులు చిత్తుగా ఇన్నింగ్స్‌ తేడాతో ఓడింది. ఈసారి మరో ఇన్నింగ్స్‌ పరాజయం ఆ జట్టు స్థాయిని చూపించింది. ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లి సారథ్యంలో భారత్‌ మరో సునాయాస సిరీస్‌ విజయం సాధించేందుకు ఎలాంటి అవరోధాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నేటి నుంచి జరిగే మ్యాచ్‌లో భారత్, వెస్టిండీస్‌ తలపడనున్నాయి. అమితోత్సాహంతో కనిపిస్తున్న భారత్‌ గత మ్యాచ్‌లాగే అదే 12 మందితో ముందురోజే జట్టును ప్రకటించింది. దాంతో ఆంధ్ర బ్యాట్స్‌మన్‌ విహారికి అవకాశం దక్కకపోగా, హైదరాబాదీ మొహమ్మద్‌ సిరాజ్‌కు సొంతగడ్డపై అరంగేట్రం చేసే చాన్స్‌ లభించలేదు. మరో యువ ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ మ్యాచ్‌ బరిలో దిగకుండానే సిరీస్‌ ముగిసిపోనుంది.  

రహానేతోనే సమస్య... 
రాజ్‌కోట్‌ టెస్టులో భారత్‌ అద్భుతమైన ఆట చూసిన తర్వాత జట్టు ఎంపికపై సందేహాలు అనవసరం. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన పృథ్వీ షా మరోసారి చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. కోహ్లి, పుజారా, రిషభ్‌ పంత్‌ల బ్యాటింగ్‌కు కూడా తిరుగులేదు. ఓపెనర్‌ రాహుల్‌ తొలి టెస్టులో విఫలమైనా మేనేజ్‌మెంట్‌ అతనిపై నమ్మకముంచింది. బౌలింగ్‌లో షమీ, అశ్విన్, కుల్దీప్‌ సత్తా చాటారు. ఉమేశ్‌కు పెద్దగా అవకాశం దక్కలేదు. జడేజా ఆల్‌రౌండర్‌గా తన విలువను ఈ మ్యాచ్‌లోనూ ప్రదర్శించేందుకు మంచి అవకాశం ఉంది. అయితే భారీ విజయం వెనుక ఉండిపోయిన ప్రధాన సమస్యను మాత్రం చక్కదిద్దుకోవాల్సి ఉంది. అజింక్య రహానే ఫామ్‌ మాత్రమే ఆందోళన కలిగిస్తోంది. బలహీన విండీస్‌పై కూడా అతను పరుగులు చేయడంలో విఫలం కావడం విమర్శలకు తావిచ్చింది. దాదాపు 14 నెలల క్రితం అతను చివరిసారి సెంచరీ నమోదు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రహానే వన్డేలు, టి20లు కూడా ఆడే అవకాశం దాదాపు లేదు కాబట్టి ఈ టెస్టులో సాధించే పరుగులు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అందువల్ల అతనికి ఈ టెస్టు కీలకం కానుంది. రాజ్‌కోట్‌లో ఐదు వికెట్లు తీసిన కుల్దీప్‌ను తప్పించడం కష్టం కాబట్టి శార్దూల్‌ మరోసారి 12వ ఆటగాడి స్థానానికి పరిమితం కానున్నాడు.  

హోల్డర్‌ వచ్చాడు... 
భారత్‌లో భారత్‌ను ఓడించడం పెద్ద జట్లకే చాలా కష్టం. కానీ వెస్టిండీస్‌ ఏమాత్రం కనీస ప్రదర్శన ఇవ్వలేక చేతులెత్తేయడం ఆ జట్టు పరిస్థితి ఎలా ఉందో చూపిస్తోంది. అయితే తుది ఫలితం ఎలా ఉండబోతున్నా రెండు కీలక మార్పులు జట్టులో కొంత విశ్వాసాన్ని నింపవచ్చు. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌తో పాటు సీనియర్‌ పేసర్‌ కీమర్‌ రోచ్‌ కూడా రావడం ఆ జట్టుకు కొంత పోరాడే అవకాశం కల్పిస్తోంది. బౌలింగ్‌తో పాటు చక్కటి బ్యాటింగ్‌ చేయగల హోల్డర్‌ కెప్టెన్సీ విండీస్‌కు అదనపు బలం కానుంది. దాదాపు ఏడాది క్రితం లీడ్స్‌లో ఇంగ్లండ్‌పై సాధించిన విజయంలాంటి ప్రదర్శనను పునరావృతం చేయగలమని అతను నమ్ముతున్నాడు. కీమో పాల్, షెర్మన్‌ లూయిస్‌ల స్థానంలో వీరిద్దరు జట్టులోకి వచ్చారు. అయితే బ్యాటింగ్‌లో తడబాటు జట్టును దెబ్బ తీస్తోంది. రాజ్‌కోట్‌ తొలి ఇన్నింగ్స్‌లో స్పిన్‌ను ఆడలేక తడబడ్డ ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో పూర్తిగా నిర్లక్ష్యపూరిత షాట్లతో వికెట్లు చేజార్చుకుంది. కాబట్టి ఈసారి ప్రధాన బ్యాట్స్‌మెన్‌పై బాధ్యత మరింత ఎక్కువగా ఉంది. గత మ్యాచ్‌లో ఏమాత్రం ప్రభా వం చూపలేని లెగ్‌స్పిన్నర్‌ బిషూ స్థానంలో విండీస్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ వారికన్‌కు అవకాశం కల్పించవచ్చు.  

► 5 ఉప్పల్‌ స్టేడియంలో ఇది ఐదో టెస్టు. భారత్‌ మూడింటిలో గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. 

తుది జట్లు (అంచనా)  
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), పృథ్వీ షా, రాహుల్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, జడేజా, షమీ, ఉమేశ్, కుల్దీప్‌. 
వెస్టిండీస్‌: హోల్డర్‌ (కెప్టెన్‌), క్రెయిగ్‌ బ్రాత్‌వైట్, కీరన్‌ పావెల్, షై హోప్, ఆంబ్రిస్, హెట్‌మెయర్, ఛేజ్, డౌరిచ్, రోచ్, బిషూ/వారికన్, గాబ్రియెల్‌. 

పిచ్, వాతావరణం 
సాధారణంగా ఉప్పల్‌ పిచ్‌పై కొంత బౌన్స్‌ ఉంటుంది. కానీ ఈ టెస్టుకు మాత్రం భారత్‌లోని చాలా వేదికల్లానే స్పిన్‌కు అనుకూలంగా సిద్ధం చేస్తున్నారు. ఆరంభంలో కొంత వరకు బ్యాటింగ్‌కు సహకరించడం మినహా ఎక్కువ భాగం స్పిన్‌ తిరగొచ్చు. 35 డిగ్రీలు దాటని సాధారణ వాతావరణంతో మ్యాచ్‌కు వర్ష సూచన లేదు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top