సెమీస్‌లో సానియా జంట | Sania Mirza in Mixed-up | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సానియా జంట

Jan 12 2017 12:35 AM | Updated on Sep 5 2017 1:01 AM

సెమీస్‌లో సానియా జంట

సెమీస్‌లో సానియా జంట

ఈ ఏడాది ఆడుతోన్న రెండో టోర్నమెంట్‌లోనూ భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా జోరు కొనసాగిస్తోంది.

సిడ్నీ: ఈ ఏడాది ఆడుతోన్న రెండో టోర్నమెంట్‌లోనూ భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా జోరు కొనసాగిస్తోంది. తన రెగ్యులర్‌ భాగస్వామి బార్బరా స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో కలిసి సిడ్నీ ఓపెన్‌లో బరిలోకి దిగిన సానియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సానియా–బార్బరా ద్వయం 6–3, 6–4తో మాడిసన్‌ బ్రింగిల్‌ (అమెరికా)–అరీనా రొడియోనోవా (ఆస్ట్రేలియా) జంటపై విజయం సాధించింది. టాప్‌ సీడ్‌ హోదాలో ఆడుతున్న సానియా–బార్బరా తొలి రౌండ్‌లో 5–7, 6–1, 10–5తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో హలవకోవా (చెక్‌ రిపబ్లిక్‌)–షుయె పెంగ్‌ (చైనా)పై కష్టపడి గెలిచారు. గురువారం జరిగే సెమీఫైనల్లో నాలుగో సీడ్‌ వానియా కింగ్‌ (అమెరికా)–యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్‌) జంటతో సానియా–బార్బరా ద్వయం తలపడుతుంది. గతవారం సానియా తన పార్ట్‌టైమ్‌ భాగస్వామి బెథానీ మాటెక్‌ (అమెరికా)తో కలిసి బ్రిస్బేన్‌ ఓపెన్‌ టైటిల్‌ను నిలబెట్టుకున్న సంగతి విదితమే.

టాప్‌ సీడ్‌ జోడీకి పేస్‌ జంట షాక్‌
మరోవైపు న్యూజిలాండ్‌లో జరుగుతున్న ఆక్లాండ్‌ ఓపెన్‌లో లియాండర్‌ పేస్‌ (భారత్‌)–ఆండ్రీ సా (బ్రెజిల్‌) జంట క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. తొలి రౌండ్‌లో పేస్‌–ఆండ్రీ సా జోడీ 7–6 (7/3), 6–3తో టాప్‌ సీడ్‌ ట్రీట్‌ హుయె (ఫిలిప్పీన్స్‌)–మాక్స్‌ మిర్నీ (బెలారస్‌) జంటపై సంచలన విజయం సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో ఈ ఇండో–బ్రెజిలియన్‌ జోడీ మార్కస్‌ డానియెల్‌ (న్యూజిలాండ్‌)–మార్సెలో డెలోలైనర్‌ (బ్రెజిల్‌)లతో ఆడుతుంది.  

బోపన్న ద్వయం ఓటమి
సిడ్నీ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్న (భారత్‌)–పాబ్లో క్యువాస్‌ (ఉరుగ్వే) జంటకు తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. బోపన్న–క్యువాస్‌ 6–7 (5/7), 7–6 (7/4), 9–11తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో మాయెర్‌–పెట్‌ష్నెర్‌ (జర్మనీ) చేతిలో పోరాడి ఓడిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement