భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ హైదరాబాదీ స్టార్ ఎన్నో సవాళ్లు అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో టెన్నిస్ స్టార్‌గా గుర్తింపు పొందింది. తన 20 ఏళ్ల కెరీర్‌లో సానియా మీర్జా మొత్తంగా 43 డబుల్స్ టైటిళ్లు సాధించింది.
కెరీర్‌లో అత్యున్నత స్థాయికి
ఇందులో మూడు మహిళల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు, మూడు మిక్స్‌డ్ డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు ఉండటం విశేషం. కెరీర్‌లో అత్యున్నత స్థాయికి ఎదిగిన సానియా మీర్జా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం చేదు అనుభవాలు చవిచూసింది. తొలుత సొహ్రాబ్ అనే వ్యక్తితో సానియా నిశ్చితార్థం చేసుకోగా.. ఆ బంధం పెళ్లి వరకు రాలేదు.
షోయబ్‌తో వివాహం, విడాకులు
ఆ తర్వాత పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించిన సానియా మీర్జా.. అతడితో వివాహ బంధంలో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో సానియాపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. అయినా సరే ఆమె ఏనాడూ ధైర్యం కోల్పోకుండా ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇక షోయబ్- సానియాలకు కుమారుడు ఇజహాన్ సంతానం.

కాగా కొన్నాళ్ల క్రితం షోయబ్ మాలిక్ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత.. సానియా- షోయబ్‌ల విడాకుల వ్యవహారం బయటకు వచ్చింది. షోయబ్ ప్రవర్తనతో విసిగిపోయిన సానియా.. తానే అతడికి విడాకులు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం కుమారుడితో కలిసి సానియా దుబాయ్‌లో నివసిస్తోంది. టెన్నిస్ అకాడమీ వ్యవహారాలతో బిజీగా గడుపుతోంది.
ఆ రెండింటి కలయిక నేను
ఈ నేపథ్యంలో తాజాగా ఇన్‌స్టా వేదికగా సానియా మీర్జా భావోద్వేగ పోస్టు పెట్టగా వైరల్‌గా మారింది. "కొన్ని రోజులు ఆమె యోధురాలిగా ఉంటుంది. మరికొన్నిసార్లు కుప్పకూలిపోతుంది. చాలాసార్లు ఈ రెండింటి కలయికగా ఆమె ఉంటుంది. అయితే, ప్రతి రోజు ఆమె ఉనికి మాత్రం అలాగే ఉంటుంది.
ధైర్యంగా నిలబడటం.. పరిస్థితులతో పోరాడటం.. నిరంతరం కొత్తగా ఏదైనా ప్రయత్నించడం.. ఆమెకు అలవాటు. ఆ ఆమెను నేనే’’ అని సానియా స్ఫూర్తిదాయక వాక్యాలు పంచుకుంది.


