పోరాటానికి పరిమితులెందుకు? | Sheetal Devi Says Dont Let Anyone Define Your Limits | Sakshi
Sakshi News home page

Sheetal Devi: పోరాటానికి పరిమితులెందుకు?

Apr 1 2026 9:19 AM | Updated on Apr 1 2026 9:30 AM

Sheetal Devi Says Dont Let Anyone Define Your Limits

ఎవరైనా, ఎక్కడైనా పతకాల వేటలో పడి... గెలిస్తే సరి ఇలా కష్టపడ్డాను. జీవితాన్నే ధారపోశాను అన్నట్లు చెబుతారు. అదే ఓడిపోతే మాత్రం వెంటనే వచ్చే నోటి మాట సరైన మౌలిక వసతులు లేవని, సమాఖ్యలోని రాజకీయాలే ఆటగాళ్ల భవిష్యత్తును కాలరాస్తున్నాయని! అన్నీ ఉండి అనే వాళ్ల తూటా మాటలివి. 

కానీ శీతల్‌ దేవి అలా కాదు. గురిపెట్టేందుకు కళ్లున్నా... విల్లును పట్టుకునేందుకు, బాణం లాగడానికి చేతి వేళ్లు కాదు కదా... అసలు చేతులే లేవు. అయినా సరే గురిపెట్టింది లక్ష్యంపై! ఉన్న రెండు కాళ్లతో విల్లును సరిచేసుకుంటుంది. కాలి వేళ్లతో బాణాన్ని సంధిస్తుంది. 2022 నుంచి అంతర్జాతీయ మెగా ఈవెంట్లలో పతకాలు గెలిచింది. తాజాగా ప్రపంచ అత్యుత్తమ ఆర్చర్‌ (2025) అవార్డే ఆమెను వరించేలా ఎదిగింది.

అందరూ పతకం కోసం ఆశపడతారు. కానీ ‘పతకమే’ ఆమె ప్రతిభకు దాసోహమంటుంది. ఈ పోటీల్లో కొందరు గెలుస్తారు. కానీ ఆమె బరిలోకి దిగితే ఆ‘పోటీ’నే మురుస్తుంది. మరికొందరేమో పోరాడి ఓడినా తమ ప్రదర్శనతో తృప్తి చెందుతారు. కానీ ఆమె పోరు... ఆడే తీరు...చూసి ఆ ప్రదర్శనకే వన్నెతెస్తుంది. 

ఆమెనే కశ్మీరీ పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి. చేతులు ముడుచుకొని తీరిగ్గా కాలక్షేపం చేసే దేశంలో చేతుల్లేని శీతల్‌ ఏ దేశమేగినా... ఏ ఈవెంట్లో కాలిడినా భారతావని పొగిడే పతకం తెస్తోంది. కొన్నేళ్లుగా పతకాల పనిపట్టిన 19 ఏళ్ల టీనేజర్‌ను తాజాగా ‘వరల్డ్‌ పారా ఆర్చర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డే పట్టుకుంది. ఈ సందర్భంగా ఆమె విజయవంతమైన పయనంపై చెప్పిన సంగతులివి... 

చాలా ప్రత్యేకం... చిరస్మరణీయం.. 
ఇది చాలా ప్రత్యేకమైన అనుభూతినిస్తోంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆర్చర్లలో ఒకరిగా నామినేట్‌ అవడమే సాఫల్యమనుకుంటే... ఏకంగా పురస్కారాన్నే గెలుపొందడం చిరస్మరణీయంగా మార్చింది. అందుకే ఇది చాలా చాలా ప్రత్యేకమైందంటాను. ఎదురైన ప్రతీ ఎదురుదెబ్బకు నిలిచి నేను పడిన కఠోర శ్రమకు, త్యాగానికి ఈ అవార్డు ప్రతిబింబం. పతకాల కోసం పాటుపడితే అవార్డే వచ్చింది. ఈ ప్రదర్శనలో నా తల్లిదండ్రులు, కోచ్‌ నా వెన్నంటే నిలిచారు. వారి అండదండలే ఈ పురస్కారానికి కారణం. 

మీకు పరిమితులు పెట్టెదెవరు?
పరిధి, పరిమితులు ఉండాలి. కానీ ప్రతి దానికి ఉండనక్కర్లేదు. ముఖ్యంగా మనకు, మన ఎదుగుదలకు, సాఫల్యానికి పరిమితులెందుకు? అందుకే అంటాను... మీ పరిమితులను నిర్ణయించే అధికారం ఇంకెవరికీ ఇవ్వకండి. మీరేంటో మీకు బాగా తెలుసు. మీరేం చేయగలరో కూడా మీకే తెలుసు. ఇన్ని తెలిసిన మీకు పరిమితులు ఎవరో విధించే అవకాశం ఎప్పటికీ ఇవ్వకూడదు. అలాంటప్పుడే మనం విజయవంతమవుతాం గుర్తుంచుకోండి. 

ఉదయం మొదలుపెడితే... 
నా శిక్షణ ప్రతీ రోజు ఉదయం 8 గంటలకే మొదలవుతుంది. సాయంత్రం 6 అయితేగానీ ముగిసిపోదు. మధ్యలో రెండు గంటలు మాత్రం తినడానికి కాస్త విశ్రాంతి తీసుకునేందుకు బ్రేక్‌ ఇస్తాను. నాకిది రొటీన్‌. సుదీర్ఘ సమయం నేను ఎంచుకున్న ‘రేంజ్‌’పైనే దృష్టి పెడతాను. అస్తమానం బాణాలే సంధిస్తూ కూర్చోను. శారీరక ఫిట్‌నెస్, మానసిక స్థైర్యం పెరిగేందుకు కూడా కసరత్తు చేస్తాను. సాంకేతికంగా మెరుగయ్యేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ద చూపిస్తాను. గతేడాది అలా చేయడం వల్లే నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోగలిగాను.

శీతల్‌ పతకాలివి...
శీతల్‌ పతకాల వేట 15 ఏళ్లకే ప్రారంభమైంది. అది కూడా ప్రతిష్టాత్మక ఆసియా పారా క్రీడల్లో..! హాంగ్జౌ (చైనా)లో జరిగిన 2022 మెగా ఈవెంట్‌లో వ్యక్తిగత, మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లలో బంగారు పతకాలు నెగ్గిన శీతల్‌ డబుల్స్‌లో రజతాన్ని గెలుచుకుంది. ఆ మరుసటి ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతంతో మెరిసింది. ఆసియా చాంపియన్‌షిప్‌ (బ్యాంకాక్‌)లో స్వర్ణం, రజతం సాధించింది. 2024 పారిస్‌లో జరిగిన పారలింపిక్స్‌లో మిక్స్‌డ్‌ టీమ్‌లో కాంస్యం చేజిక్కించుకుంది. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌ (కొరియా) లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement