
టీమ్‌మేట్ యువరాజ్‌తో పంచుకున్న పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు
లీడ్స్: ప్రపంచకప్‌లో ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ పరుగుల వరద కొనసాగుతోంది. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మరో సెంచరీ బాదిన రోహిత్ (94 బంతుల్లో 103; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలు (5) చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఇక ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు కొట్టిన క్రికెటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ (44 ఇన్నింగ్స్‌లో 6 సెంచరీలు) సరసన రోహిత్ (16 ఇన్నింగ్స్‌లో 6 సెంచరీలు) చేరాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శ్రీలంకతో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవరిస్తున్న అతను టీమ్‌మేట్ యువరాజ్‌తో పంచుకున్న పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
(చదవండి : ఆనందం ఐదింతలు)
సరైన సమయంలో ఆడతానన్నాడు..
‘ఐపీఎల్ 12వ సీజన్‌లో తక్కువ పరుగులే చేయగలిగాను. ఆ సమయంలో నా సహచరుడు (అన్నగా భావిస్తా) యవరాజ్‌సింగ్‌తో క్రికెట్, లైఫ్ గురించి కాసేపు ముచ్చటించేవాణ్ణి. ఈ సీజన్‌లో పరుగులు చేయలేకపోతున్నాను అని ఆయనతో చెప్పినప్పుడు.. ‘మరేం ఫరవాలేదు. సరైన సమయంలో నువ్ గాడిలో పడతావ్. ఇదేం పట్టించుకోవద్దు’ అని సలహా ఇచ్చాడు. బహుశా వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకునే యువీ అలా అనుంటాడు. 2011 ప్రపంచకప్‌నకు ముందు జరిగిన ఐపీఎల్‌లో యువీ కూడా పెద్దగా రాణించలేదు. కానీ, వరల్డ్‌కప్‌లో అద్భుతంగా రాణించి భారత్‌కు కప్ అందించాడు. ఇక ఐపీఎల్ 12వ సీజన్‌లో 28.92 సగటుతో 15 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ కేవలం 405 పరుగులు మాత్రమే సాధించిన విషయం తెలిసిందే.