అప్పుడే నాకు సంతృప్తి : రోహిత్‌ శర్మ

Five Hundreds Count For Nothing If India Did Not Win World Cup Rohit Sharma Says - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రోహిత్‌ శర్మ... పన్నెండు ప్రపంచ కప్‌ల చరిత్రను తిరగరాసిన వీరుడు..ఒకే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు.. వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఘనుడు.. అనితర సాధ్యమైన రీతిలో మూడు వన్డే డబుల్‌ సెంచరీలు చేసి రికార్డులను బద్దలు కొట్టిన హిట్‌మ్యాన్‌‌. ఇలా రోహిత్‌ను ఎంత ప్రశంసించిన తక్కువే. ఈ ప్రపంచ కప్‌ టోర్నీలో పుల్‌ ఫామ్‌లో కొనసాగుతూ.. వరుస సెంచరీలతో టీమిండియాను సునాయసంగా సెమీఫెనల్‌కు తీసుకొచ్చాడు. శనివారం శ్రీలంకతో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ శతకం బాది పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ భారత్‌కు ఘన విజయాన్ని అందించాడు.  

టోర్నీలో ఇప్పటికే నాలుగు సెంచరీలను తన ఖాతాలో వేసుకున్న రోహిత్‌ తాజాగా శ్రీలంకపై మరో శతకం (94 బంతుల్లో 103; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించాడు. దీంతో ఒక ప్రపంచకప్‌ టోర్నీలో అత్యధిక సెంచరీలు(5) సాధించిన తొలి ఆటగాడిగా హిట్‌మ్యాన్‌ రికార్డు సృష్టించాడు. ఇన్ని రికార్డులు సాధించిన కూడా ఇవేవి తనకు సంతృప్తి ఇవ్వవని, ఈ ప్రపంచ కప్‌లో టీమిండియా గెలిచినప్పుడే సంతోషంగా ఫీలవుతానంటున్నాడు టీమిండియా హిట్‌ మ్యాన్‌. 

(చదవండి : చరిత్ర సృష్టించిన రోహిత్‌)

శ్రీలంకపై విజయం సాధించిన అనంతరం ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ మీడియాతో మాట్లాడారు. మీరు వరుసగా ఐదు సెంచరీలు చేసి పుల్‌ హ్యాపీగా ఉన్నారు కదా అని అడగ్గా... ‘ఎన్ని సెంచరీలు చేశామని ముఖ్యంగా కాదు. ప్రపంచ కప్‌ సాధించామా లేదా అనేది ముఖ్యం. ఈ ప్రపంచ కప్‌ను సాధిస్తే నేను వరుస సెంచరీలు చేసినందుకు సంతోషిస్తా. కప్‌ సాధించకుండా ఎన్ని సెంచరీలు చేసిన వృధానే’ అని రోహిత్‌ తన మనసులోని మాటలను చెప్పాడు.

(చదవండి : ఆనందం ఐదింతలు)

తన వరుస సెంచరీల వెనుక గల రహస్యం ఏంటని ప్రశ్నించగా.. ‘ప్రతి మ్యాచ్‌ నాకు కొత్తే. ప్రతిరోజు ప్రెష్‌ మైండ్‌తో గ్రౌండ్‌లోకి వస్తా. నేను సెంచరీల కోసమో.. రికార్డుల కోసమో ఆట ఆడడం లేదు. నా జట్టు గెలుపే లక్ష్యంగా ఆడుతాను. ప్రతి క్రీడాకారుడు ఇలాగే ఆలోచిస్తాడు’  అని రోహిత్‌ చెప్పాడు. కాగా వరుసగా సెంచరీలతో చెలరేగిపోతున్న రోహిత్‌.. ఈ ప్రపంచ కప్‌లో 647 పరుగులు చేసి ఆగ్రస్థానానికి చేరుకున్నాడు. లీగ్‌ దశలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే అందులో ఐదు సెంచరీలు, ఒక అర్థసెంచరీ ఉండటం విశేషం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top