
రాంచీ: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. టెస్టుల్లో, వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించిన మూడో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన నాల్గో క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. భారత్ తరఫున సచిన్, సెహ్వాగ్‌లు మాత్రమే రెండు ఫార్మాట్లలో డబుల్ సెంచరీ సాధించిన ఆటగాళ్లు. ఇక వెస్టిండీస్ హిట్టర్ క్రిస్ గేల్ కూడా టెస్టు, వన్డే ఫార్మాట్‌లో సెంచరీలు సాధించాడు. రోహిత్ శర్మ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించగా, తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఈ ఫార్మాట్‌లో తొలి వ్యక్తిగత ద్విశతకం నమోదు చేశాడు. 249 బంతుల్లో 28 ఫోర్లు, 4 సిక్సర్లతో డబుల్ సెంచరీ మార్కును చేరాడు. సిక్స్‌తోనే సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. డబుల్ సెంచరీని కూడా సిక్స్‌తోనే సాధించడం విశేషం. లంచ్ తర్వాత ఎన్‌గిడి బౌలింగ్‌లో సిక్స్ కొట్టి డబుల్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించిన తర్వాత టెస్టుల్లో కూడా ఆ మార్కును చేరిన తొలి క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు.
ఇక ఒక సిరీస్‌లో 500 పరుగులకు పైగా సాధించిన ఐదో భారత ఓపెనర్‌గా రోహిత్ అరుదైన జాబితాలో చేరిపోయాడు. వినోద్ మన్కడ్, కుందేరేన్, సునీల్ గావస్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లో గతంలో ఒక్క సిరీస్‌లో ఐదు వందలకు పైగా సాధించిన భారత ఓపెనర్లు. సఫారీలతో తొలి టెస్టులో రోహిత్ రెండు భారీ శతకాలు సాధించిన సంగతి తెలిసిందే.ఈ టెస్టు మ్యాచ్‌లో రోహిత్ 212 పరుగుల వద్ద ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. రబడా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రోహిత్ ఔటయ్యాడు. ఎన్‌గిడి క్యాచ్ పట్టడంతో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసింది.అంతకుముందు రహానే(115) నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. వీరిద్దరూ నాల్గో వికెట్‌కు 267 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని సాధించారు.