ఎదురులేని రైల్వేస్‌

Railways third victory in BCCI Senior women's one day league - Sakshi

వరుసగా మూడో విజయం ∙బీసీసీఐ సీనియర్‌ మహిళల వన్డే లీగ్‌

సాక్షి, హైదరాబాద్‌ : బీసీసీఐ సీనియర్‌ మహిళల వన్డే లీగ్‌ ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో రైల్వేస్‌ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆంధ్రతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్‌ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆంధ్ర  నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్‌ హిమబిందు (107 బంతుల్లో 53; 7 ఫోర్లు), సుధారాణి (35 బంతుల్లో 28; 1ఫోర్, 2 సిక్స్‌లు), పుష్పలత (22) రాణించారు. రైల్వేస్‌ బౌలర్లలో సుకన్య (2/19), పూనమ్‌ యాదవ్‌ (2/30) ఆకట్టుకున్నారు. 157 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రైల్వేస్‌  మరో 8 ఓవర్లు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెల్వేస్‌ తరఫున కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (22; 3 ఫోర్లు), తిరుష్‌ కామిని (39; 5 ఫోర్లు), పూనమ్‌ రౌత్‌ (36 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో మల్లిక (2/44) ఆకట్టుకుంది.  

ఓటమితో ముగిసిన హైదరాబాద్‌ పోరు 
ఐదు జట్లున్న ఎలైట్‌ ‘ఎ’ గ్రూప్‌లోనే ఉన్న హైదరాబాద్‌ తమ నాలుగు మ్యాచ్‌లను పూర్తి చేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఆరు వికెట్ల తేడాతో ఓడింది. టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ కెప్టెన్‌ గౌహర్‌ సుల్తానా తొలుత బ్యాటింగ్‌ చేసే నిర్ణయం తీసుకుంది. స్నేహ (41 బంతుల్లో 35; 7 ఫోర్లు), మహేష్‌ కావ్య (33, 3 ఫోర్లు), స్రవంతి నాయుడు (31, 4 ఫోర్లు) రాణించడంతో.. హైదరాబాద్‌ భారీ స్కోరు చేస్తుందనిపించినా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 48.3 ఓవర్లలో 202 పరుగులకే పరిమితమైంది. ప్రత్యర్థి బౌలర్లలో ఎన్‌ ఎస్‌ చౌహాన్‌ (2/22), హర్లీన్‌ డియోల్‌ (2/31) ఆకట్టుకున్నారు. అనంతరం 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హిమాచల్‌ ప్రదేశ్‌ జట్టు 49.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. హర్లీన్‌ డియోల్‌ (107 బంతుల్లో 79; 7 ఫోర్లు), నీనా చౌదరి (43), కెప్టెన్‌ సుష్మ (30) రాణించారు. గౌహర్‌ సుల్తానా (3/34) రాణించినా ఫలితం లేకపోయింది. ఒక విజయం, మూడు పరాజయాలతో హైదరాబాద్‌ నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top