‘సర్ఫరాజ్‌ స్లీప్‌ ఫీల్డర్‌’

Pak captain Sarfraz Ahmed trolled for yawning during India-Pakistan match - Sakshi

ఆటగాళ్లంతా క్రికెట్‌ వదిలి కుస్తీ ఆడాలి

పాక్‌ అభిమానుల ఆవేదన  

మాంచెస్టర్‌: పాకిస్తాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆవలింతలపై మీమ్‌లు... అతని శరీరంపై జోకులు... సర్ఫరాజ్‌ కీపర్‌ మాత్రమే కాదు, ‘స్లీప్‌’ ఫీల్డర్‌ అంటూ అతని ఆవలింతలపై వ్యంగ్యాస్త్రాలు... జట్టు సభ్యుల ఫిట్‌నెస్‌పై పరిహాసాలు... దేశ ప్రధాని మాటనూ పట్టించుకోలేదని విసుర్లు, మ్యాచ్‌కు ముందు రోజు బయటకు షికార్లు చేయడంపై ఆగ్రహావేశాలు... ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత్‌ చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత పాకిస్తాన్‌పై విమర్శలతో సోషల్‌ మీడియా హోరెత్తిపోయింది.

చిరకాల ప్రత్యర్థి చేతిలో మళ్లీ ఓడటంతో ఆ దేశ అభిమానులు తమ కోపాన్ని ఆపుకోలేకపోయారు. సహజంగానే తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మైదానంలో మ్యాచ్‌ చూసిన అనంతరం ఒక వీరాభిమాని తన ఆవేదనను ప్రదర్శిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ‘ఎన్నో సమస్యలు ఉన్న పాకిస్తాన్‌లో మాకు క్రికెట్‌ కొంత సాంత్వననిస్తుంది. ఎంతో డబ్బు పెట్టి, ఇబ్బందులు పడి ఎన్నో ఆశలతో ఇక్కడికొస్తే ఇలాంటి ఆట ఆడతారా? ఆటగాళ్లకు కనీస ఫిట్‌నెస్‌ కూడా లేదు. మ్యాచ్‌కు ముందు రోజు  రాత్రి వారు పిజ్జాలు, బర్గర్లు, ఐస్‌క్రీమ్‌లు తిన్నారని విన్నాను. ఎవరైనా ఆటగాళ్లు ఇలాంటి తిండి తింటారా? వీరు క్రికెట్‌లో కాదు కుస్తీలో పోటీ పడాల్సింది.

సర్ఫరాజ్‌ అయితే నిద్ర మాత్రలు వేసుకున్నట్లు కనిపించాడు.అతను మమ్మల్ని మోసం చేశాడు’ అని సదరు అభిమాని ఏడ్చేశాడు. పాక్‌ క్రికెటర్లు బేకరీ, ఐస్‌క్రీమ్‌ షాప్‌కు వెళ్లిన ఫోటోలు, షోయబ్‌ మాలిక్‌ తన భార్య సానియా మీర్జా, ఇద్దరు సహచరులతో కలిసి ‘హుక్కా కేఫ్‌’లో ఉన్న ఫోటోలు కూడా బయటకు రావడంతో అభిమానుల ఆగ్రహం మరింత పెరిగింది. అయితే పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) దీనిని ఖండించింది. ప్రచారంలో ఉన్న వీడియోలు, ఫోటోలు మ్యాచ్‌కు రెండు రోజుల ముందు (శుక్రవారం) నాటివని... మ్యాచ్‌కు ముందు రాత్రి జట్టు సభ్యులంతా నిర్ణీత సమయానికి గదుల్లో ఉన్నారని, నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది.  

ఇమ్రాన్‌ సూచనను పట్టించుకోలేదని...
పాకిస్తాన్‌ టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ తీసుకోవాలని దేశానికి ప్రపంచ కప్‌ అందించిన దిగ్గజం, ప్రస్తుతం ప్రధాని అయిన ఇమ్రాన్‌ ఖాన్‌ మ్యాచ్‌కు ముందు సూచించాడు. ఛేదనలో పాక్‌ బలహీనం కాబట్టి మాజీలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే సర్ఫరాజ్‌ మాత్రం ఫీల్డింగ్‌ను ఎంచుకున్నాడు. దీనిపై విమర్శలకు తోడు ‘ఇమ్రాన్‌ ఇంగ్లీష్‌లో రాశాడు కాబట్టి సర్ఫరాజ్‌కు అర్థం కాలేదు’ అంటూ అభిమానులు దెప్పిపొడిచారు. మరోవైపు జట్టులో ఆటగాళ్ల మధ్య విభేదాలే ఓటమికి కారణమయ్యాయని కూడా పాక్‌ మీడియా కథనాలు ప్రచురించింది.  

90ల్లో పాకిస్తాన్‌ జట్టు చాలా బలంగా ఉండి భారత్‌పై ఆధిపత్యం ప్రదర్శించేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయి భారత్‌ మెరుగ్గా తయారైంది. ఇలాంటి మ్యాచ్‌లలో మేం ఒత్తిడిని అధిగమించలేకపోతున్నాం. మా జట్టు అన్ని రంగాల్లో విఫలమైంది. రెండు రోజులుగా పిచ్‌ కప్పి ఉంచారు. తేమ ఉండటంతో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ తీసుకున్నా. అయితే మా ప్రణాళిక ప్రకారం బౌలింగ్‌ చేయడంలో విఫలమయ్యాం. మా శారీరక భాష బాగా లేదంటే ఒప్పుకోను. ఆటగాళ్లంతా బాగానే ప్రయత్నించారు. మా ఫీల్డింగ్‌ బాగా లేక రోహిత్‌ రెండు సార్లు రనౌట్‌ కాకుండా తప్పించుకున్నాడు. అతను ఔటైతే పరిస్థితి భిన్నంగా ఉండేది. మా ఆటగాళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో అంతా బాగుంది.      
–సర్ఫరాజ్‌ అహ్మద్, పాక్‌ కెప్టెన్‌  


రెస్టారెంట్‌లో షోయబ్‌ మాలిక్, సానియా, వహాబ్‌ రియాజ్‌ తదితరులు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top