శతక్కొట్టిన బర్న్స్, హెడ్‌

oe Burns, Travis Head smash big tons to put Australia in command - Sakshi

తొలిరోజే ఆస్ట్రేలియా 384/4

శ్రీలంకతో రెండో టెస్టు

కాన్‌బెర్రా: శ్రీలంకతో మొదలైన రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలిరోజే భారీస్కోరు చేసింది. ఓపెనర్‌ జో బర్న్స్‌ (172 బ్యాటింగ్‌; 26 ఫోర్లు), మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ ట్రావిస్‌ హెడ్‌ (161; 21 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీలతో కదంతొక్కారు. దీంతో శుక్రవారం ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 384 పరుగులు చేసింది. టాస్‌ నెగ్గిన ఆతిథ్య కెప్టెన్‌ పైన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే అనుభవంలేని లంక బౌలర్లు ఆరంభంలో ఆస్ట్రేలియాను వణికించారు. దీంతో 28 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హ్యారిస్‌ (11), ఉస్మాన్‌ ఖాజా (0)లను విశ్వ ఫెర్నాండో ఔట్‌ చేస్తే... లబ్‌షేన్‌ (6)ను కరుణరత్నే పెవిలియన్‌ చేర్చాడు. ఈ దశలో బర్న్స్, హెడ్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతని తమ భుజాన వేసుకున్నారు. 34 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ బర్న్స్‌ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. రెండో సెషన్‌లో బర్న్స్‌ 147 బంతుల్లో, మూడో సెషన్‌లో హెడ్‌ 193 బంతుల్లో సెంచరీలు పూర్తిచేసుకున్నారు. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 308 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అనంతరం హెడ్‌.. ఫెర్నాండో బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోగా... 336 పరుగుల వద్ద ఆసీస్‌ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. ఆటముగిసే సమయానికి ప్యాటర్సన్‌ (25 బ్యాటింగ్‌), బర్న్స్‌ క్రీజులో ఉన్నారు. 

ఎట్టకేలకు సెంచరీ+సెంచరీ 
ఆసీస్‌ సెంచరీ వెలతి ఎట్టకేలకు తీరింది. ఓపెనర్‌ బర్న్స్‌ తాజా శతకం ఆ లోటును తీర్చగా... హెడ్‌ సెంచరీ ‘ప్లస్‌’ అయింది. భారత్‌తో నాలుగు టెస్టులాడినా సాధ్యంకాని మూడంకెల స్కోర్లను ఈ టెస్టులో సాధించారు. అక్టోబర్‌ తర్వాత (పాక్‌పై ఖాజా) నమోదైన సెంచరీలు కూడా ఇవే కావడం గమనార్హం. గత 13 నెలల కాలంలో ఆస్ట్రేలియన్లు కేవలం మూడు శతకాలే చేయగలిగారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top