ధోని కొట్టిన ఆ సిక్స్‌ ఇంకా..

Never Ever Forget Ms Dhoni Winning Six - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని కొట్టిన ఆ సిక్స్‌ ఇంకా.. కళ్లముందు కదలాడుతోంది. అవును మరి అది ఏమైనా మాములు సిక్సా.. 28 ఏళ్ల భారత అభిమానుల నిరీక్షణకు తెరదించిన సిక్స్‌.. కెరీర్‌లో అన్ని ఘనతలు అందుకొని ఇదొక్కటి సాధిస్తే ఇక చాలని ఎదరు చూస్తున్న ఓ దిగ్గజం కల నెరవేర్చిన సిక్స్‌.. యావత్‌ భారత క్రికెట్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన సిక్స్‌. భారత జట్టును ప్రపంచ విజేతగా నిలబెట్టిన సిక్స్‌. సరిగ్గా ఎనిమిదేళ్ల కింద ఇదే రోజు మహేంద్రుడి బ్యాట్‌ నుంచి జాలువారిన ఆ సిక్స్‌ను ఎవరూ ఎప్పుడూ మర్చిపోలేరు.  

2011 ఏప్రిల్ 2న ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన ఉత్కంఠకర వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంకపై విజయం సాధించి భారత్‌.. తన చిరకాల వాంచను నెరవేర్చుకుంది. అయితే ఈ మధుర క్షణాన్ని గుర్తు చేస్తూ బీసీసీఐ.. ధోని విన్నింగ్‌ షాట్‌ వీడియోను ట్వీట్‌ చేయగా.. అభిమానులు తమ స్టేటస్‌లుగా పెట్టుకుంటూ ఆ మధుర జ్ఞాపకాన్ని నెమరువేసుకుంటున్నారు. ఈ ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభం నుంచి అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోయిన భారత్‌.. ఫైనల్లో మాత్రం కొంత తడబడి ఉత్కంఠకు తెరలేపింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. లంక బ్యాటింగ్‌లో మహేలా జయవర్ధనే 103 పరుగులు, సంగక్కర 48 పరుగులు చేశారు. అనంతరం 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో తడబడింది. సెహ్వాగ్ డకౌట్‌, సచిన్ టెండూల్కర్(18) వికెట్లను త్వరగా కోల్పోయి కష్టాల్లోపడింది.

ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ఆపద్భాంధవుడి పాత్ర పోషించాడు. ఆచితూచి ఆడుతూ భారత ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టాడు. 97 పరుగులు చేసి ఒత్తిడిని అధిగమించలేక ఔటయ్యాడు. చివర్లో ధోని అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పాడు. చివరి 11 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి ఉండగా.. ధోని తన మార్క్ హెలికాఫ్టర్ షాట్‌తో సిక్సు బాదాడు. అంతే.. స్టేడియం అంత ఒక్కసారిగా హర్షధ్వానాలతో హోరెత్తిపోయింది. యావత్‌ భారత్‌ సంబరాల్లో మునిగిపోయింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top