
కరాచీ: తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ఈ ఏడాదే ముగింపు పలుకుతానని పాకిస్తాన్ ఆల్ రౌండర్ మొహ్మద్ హఫీజ్ మరోసారి స్పష్టం చేశాడు. గత జనవరిలో తన వీడ్కోలు నిర్ణయంపై మనసులో మాట చెప్పిన హఫీజ్.. తన అంతర్జాతీయ కెరీర్‌లో చివరి కోరిక ఒకటుందని పేర్కొన్నాడు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ తరఫున ఆడటమే తన ప్రధాన కోరికన్నాడు. ఆపై అంతర్జాతీయ క్రికెట్ నుంచి దర్జాగా తప్పుకుంటానన్నాడు. కాగా, మొత్తం క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు చెప్పనని, కేవలం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు మాత్రమే దూరం అవుతానని తెలిపాడు. తాను లీగ్‌లు ఆడుకుంటా క్రికెట్‌ను ఆస్వాదిస్తానన్నాడు. 2003లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా అరంగేట్రం చేసిన హఫీజ్ పాక్ టాపార్డర్ బ్యాట్స్‌మన్‌గా కీలకపాత్ర పోషించాడు. కొన్ని సందర్భాల్లో స్పిన్నర్‌గాను ఆకట్టుకున్నాడు.
అయితే 2015లో అతని బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందని 12 నెలలు బౌలింగ్ వేయకుండా నిషేధం విధించారు. పాకిస్తాన్ టి20 జట్టుకు సారథ్యం కూడా వహించాడు. అతని కెప్టెన్సీలో పాక్ 29 మ్యాచ్‌లు ఆడగా... 17 గెలిచి, 11 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒకటి టైగా ముగిసింది. ఇప్పటి వరకూ 55 టెస్టుమ్యాచ్‌లు ఆడిన హఫీజ్.. 218 వన్డేలు ఆడాడు. ఇక 91 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. కాగా, గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్ తర్వాత హఫీజ్‌ను పీసీబీ పెద్దలు పక్కన పెట్టేశారు. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌కు హాఫీజ్‌ను తిరిగి జట్టులో అవకాశం కల్పించారు.