బుమ్రాపై గప్టిల్‌ ప్రశంసలు

Martin Guptill Praises Jasprit Bumrah - Sakshi

ఆక్లాండ్‌: భారత్‌తో జరిగిన రెండో టీ20లో ఈడెన్‌ పార్క్‌ ట్రాక్‌ స్లోగా స్పందించిన కారణంగానే తాము బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయామని న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్ గప్టిల్‌ పేర్కొన్నాడు. భారత్‌కు దాసోహం కావడానికి పిచ్‌ ప్రధాన కారణమన్నాడు. ఇక భారత సమిష్ట ప్రదర్శనపై గప్టిల్‌ ప్రశంసలు కురిపించాడు. భారత్‌ ఆల్‌రౌండ్‌తో అదరగొట్టి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిందన్నాడు.  టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాపై గప్టిల్‌ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా బౌలింగ్‌ అద్భుతమని, అతని బౌలింగ్‌లో ఎదురుదాడికి దిగడం చాలా కష్టమన్నాడు. మ్యాచ్‌ తర్వాత గప్టిల్‌ మాట్లాడుతూ.. ‘పిచ్‌ చాలా మందకొడిగా మారిపోయింది. పిచ్‌ కారణంగానే మేము బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో పరుగులు తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాం. పిచ్‌ మరీ నెమ్మదించడంతో బ్యాటింగ్‌ చేయడం కష్టం అయ్యింది. మా టాప్‌-4 ఆటగాళ్లు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేయాల్సింది. కానీ పిచ్‌ సహకరించని కారణంగా సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం.

పిచ్‌ నుంచి వచ్చిన సహకారాన్ని భారత బౌలర్లు బాగా సద్వినియోగం చేసుకున్నారు. ప్రధానంగా డెత్‌ ఓవర్ల స్పెషలిస్టు బుమ్రా మాకు దడపుట్టించాడు. ఆది నుంచి చివరి వరకూ బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి మమ్మల్ని నియంత్రించాడు. బుమ్రాపై ఎదురుదాడికి దిగడం చాలా కష్టమైంది. మేము 170 పరుగులు చేస్తే పోరాడే వాళ్లం. కానీ టీమిండియా అద్భుతమైన బౌలింగ్‌తో అది సాధ్యం కాలేదు. వారు చాలా డాట్‌ బాల్స్‌ వేశారు. దాంతోనే మేము భారీ పరుగులు చేయలేకపోయాం. ఇక భారత్‌ బ్యాటింగ్‌లో కూడా మెరిసింది. వారు చక్కటి భాగస్వామ్యాలు సాధించారు. భారత్‌లో అత్యుత్తమ ఆటగాళ్లు, మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు.  మేము ఎంత గొప్పగా బౌలింగ్‌ వేసినా కేఎల్‌ రాహుల్‌-శ్రేయస్‌ అయ్యర్‌లు కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశాం. ఫలితంగా మరో ఓటమి చవిచూశాం’ అని గప్టిల్‌ పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: ఆడుతూ... పాడుతూ...)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top