మంధాన, షెఫాలీ ‘రికార్డు’ బ్యాటింగ్‌

Mandhana And Shafali Record Stand Decimates West Indies - Sakshi

సెయింట్‌ లూసియా:  వెస్టిండీస్‌ మహిళలతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత మహిళలు..అదే జోరును టీ20ల్లో కూడా కొనసాగిస్తున్నారు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 84 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత మహిళలకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు స్మృతీ మంధాన, షెఫాలీ వర్మలు తొలి వికెట్‌కు 143 పరుగులు సాధించారు. షెఫాలీ(73; 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు), మంధాన(67; 46 బంతుల్లో 11 ఫోర్లు) బ్యాట్‌ ఝుళిపించారు.

విండీస్‌తో జరిగిన చివరి వన్డేలో విశేషంగా రాణించి సిరీస్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మంధాన.. టీ20 మ్యాచ్‌లో కూడా బౌండరీల మోతం మెగించారు. మరొకవైపు షెఫాలీ కూడా బ్యాట్‌కు పని చెప్పడంతో భారత స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఈ జోడికి జతగా చివర్లో హర్మన్‌ప్రీత్‌(21 నాటౌట్‌; 13 బంతుల్లో 3 ఫోర్లు), వేదా కృష్ణమూర్తి(15 నాటౌట్‌; 7 బంతుల్లో 2 ఫోర్లు) ధాటిగా ఆడటంతో భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కాగా, మంధాన-షెఫాలీలు 143 పరుగుల భాగస్వామ్యం రికార్డు పుస్తకాల్లో లిఖించబడింది. మహిళల టీ20ల్లో భారత్‌ తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక పరుగుల భాగస్వామ్యం. ఈ క్రమంలోనే 2013లో బంగ్లాదేశ్‌ జరిగిన మ్యాచ్‌లో నమోదైన 130 పరుగుల భాగస్వామ్యం రికార్డును మంధాన-షెఫాల్లీలు బ్రేక్‌ చేశారు.

ఆపై 186  పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ మహిళలు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 101 పరుగులే చేశారు. వికెట్‌ కీపర్‌ షీమైన్‌ క్యాంపబెల్‌(33) మినహా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో శిఖా పాండే, రాధా యాదవ్‌, పూనమ్‌ యాదవ్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్‌లకు చెరో వికెట్‌ లభించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top