
ఆ 8 ఓవర్లలో మనోళ్లను చితక్కొట్టారు
చివరి 8 ఓవర్లలో భారత బౌలర్లు చేతులెత్తేయగా, ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ ఇరగదీశారు. దీంతో మ్యాచ్ టీ-20లా సాగింది.
పుణె: టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో 42 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు 245/5. క్రీజులో బెన్ స్టోక్స్ (12), మొయిన్ అలీ (0) ఉన్నారు. చివరి 8 ఓవర్లలో ఇంగ్లండ్ 70 వరకు పరుగులు చేసే అవకాశముందని భావించారు. భారత బౌలర్లు రాణిస్తే 300 స్కోరుకు కాస్త అటూ ఇటుగా ఇంగ్లండ్‌ను కట్టడి చేయవచ్చని ఊహించారు. అయితే సీన్ రివర్సయింది. చివరి 8 ఓవర్లలో భారత బౌలర్లు చేతులెత్తేయగా, ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ ఇరగదీశారు. దీంతో మ్యాచ్ టీ-20లా సాగింది.
చివర్లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా ధారాళంగా పరుగులిచ్చేశాడు. బుమ్రా బౌలింగ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు నాలుగు సిక్సర్లు, ఫోర్ బాదారు. ఇక ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు, సిక్సర్ కొట్టారు. అశ్విన్ కూడా ఓ ఓవర్లో 4, 6 సమర్నపించుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ స్కోరు బోర్డు వేగంగా పరుగులు పెట్టింది. పూర్తి ఓవర్లు అయ్యే సరికి ఇంగ్లండ్ 7 వికెట్లకు 350 పరుగులు చేసి టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆఖరి 8 ఓవర్లలో ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. స్టోక్స్ 40 బంతుల్లో 62, అలీ 17 బంతుల్లో 28 పరుగులు చేశారు. చివర్లో భారత బౌలర్లు రెండు వికెట్లు తీసినా పరుగులను కట్టడి చేయలేకపోయారు. పుణెలో ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విరాట్ సేన టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.